శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము

  • భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము

    (శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)

    -: దేశదేశాలకు దేవతాపంపుల వివరం :-

    కర్నాటక దేశానికి కాళిపంపు, తురకాన్య దేశానికి దుర్గపంపు, అరవరాజ్యానికి అర్కసోముని పంపు, మొరసరాజ్యానికి భద్రకాళి పెంపు, సందుగొందుల దేశానికి బైరవుని పంపు, ఆ మీదట అష్టదిక్కులను బాలలు మొదలుగాను నల్లగాలి బోసి నడినెత్తి వ్రక్కలై, గండమాల పుండ్లు, రాచపుండ్లు, అబ్బలు, బొబ్బలుబుట్టి చచ్చేరు. సందేహములేదు. విచిత్ర వ్యాధులచేత వుట్టి బడ్డట్లుగానే కూర్చున్నచోటనే ప్రజలు మగ్గేరు. ఆకాశాన నాల్గుచుక్కలు బుట్టీని, అమ్మరో తమకు ప్రాణాలు లేవని వెతబడి చచ్చేరు. ఆ మీదట ఆకాశాన ధ్వని బుట్టీని, అందువల్లను చచ్చేరు. పశువులు, మేకలు, గొర్రెలు ఆకాశము చూచి “అహో” యని అరచిన ‘భో’ ‘భో’ యని భూదేవి పలికీని, అందువల్లను కొందరు చచ్చేరు. జలములలో వున్న జంతువులు తాము చస్తిమని పలుకుతూ చచ్చీని, భూదేవిమీద వున్న దుష్టులెల్ల నిర్వంశమై పొయ్యేరు. పర్వతానికి ఒక ముసలివచ్చి యెనిమిది దినాలు వుండి, భ్రమరాంబ గుడిలో మేకపోతువలె అరచి మాయమై పొయ్యీని, శ్రీశైలశిఖరాన నిప్పులు రాలిని, ‘తేజమే’ ‘తేజమే’ అనే వాక్యాలు పుట్టీని, వూర వూర ప్రజలు రచ్చకొట్టాలకాడ మొత్తుకొనేరు, ‘దేవి’ ‘దేవి’ అనే శక్తి బెబ్బులివలె సంచరించీని నానా తోయాల వాక్యాలు పర్వతముమీద పుట్టీని, బసవేశ్వరుని కంటనీళ్లుకారీని, మహాదేవునికంట నీళ్లుకారీని. కటకటాయని రంకెవేసీని, ‘ధణం’ ‘ధణం’ యని కాలుదువ్వీని, సూర్యమండలమందు ‘వాక్కు’ ‘వాక్కు’ అనే శబ్దము బుట్టీని, ఆకాశాన ధర్మదేవత సంచరించీని, మహదేవుని కన్నుల నిప్పులురాలీని, జడలు యెగసి యెగసి ఆడీని, త్రిశూల ఢమరుకాలు కదలీని పర్వతమున వుట్ల కంభముమీద ప్రతిమ మాట్లాడీని, భ్రమరాంబ ముందర బసవేశ్వరుడు తోక విదళించుకున్నదే గుర్తు. గుగ్గిళ్ళరాయుడు ఏలూరు ఏనుగచేత చచ్చీని, తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మేచ్ఛులు ఆడి పాడేరు, కపిధ్వజము కదలీని, ‘ఘం’ అనే ధ్వని బుట్టీని, నానాదిక్కులను పంపులు యెగసి యెగసి ఆడీని, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామికి తిరుమేన చమట బుట్టీని, లక్ష్మిదేవి కన్నుల నీళ్లుగారీని, వినాయకుడు వూరవూర వేదమంత్రాలు చదివీని, నదులలో స్త్రీలు జోలలు పాడేరు, స్త్రీల కన్నుల నెత్తురు కురిశీని, వూరూర బెబ్బులులు మనుష్యుల కరచి చంపీని, దుర్గ స్థళాలకు తురకలుబారి గొర్రెలై యుండేరు.-: వీర వసంతరాయలు వచ్చేటపుడు పుట్టే కార్యాలు :-

    సామవేద ఘోషణాలచేత బాల్య, యవన, ప్రౌఢలు వీరభోజ వసంతరాయుల చరిత్రలు పాడేరు, పువ్వులవాన కురిసీని, ఆ మీదట అమవాస్యనాడు చంద్రోదయ మయ్యీని, సూర్యనందిననే వుద్భవమైయ్యీని, సూర్యనందిన మాపటివెంతల భూమి కదలాడీని, ఆకాశం యెర్రనయ్యీని. ఆకాశాన ‘భుగుళ్లు’ ‘భుగుళ్లు’ మనే శబ్దము బుట్టీని, కేశవనామాలు అందరి కర్ణాలకు వినబడీని, గ్రామాంతరాల, పట్నాల లక్ష్మిదేవి యేడ్చీని, నెత్తురువాన గురిసీని, పట్నాల లక్ష్మీదేవి వుద్భవమయ్యీని, సూర్యనందిన ప్రకాశమయ్యీని, వీరభోగి వస్తూ వున్నాడని భూమి పలికీని, చతుర్వేదాలు తనలో తానే చదివీని ఆ విూదట ఆకాశాన నుండి అంతర గంగోదకం గురిసీని, సముద్రాలు వుప్పొంగీని, వాయిద్యాల చప్పుళ్లు వినబడీని, మహానందిలో పదిహేను దినాలు వుండి భూమిమీద ప్రకాశం అయ్యేరు, ఆ మీదట తత్పూర్వమందు ధర్మం యట్లా నడచునో ఆ తీరుగానే ధర్మము ముందర నడిపిస్తూ యున్నారము. నానా వర్ణాదులయందు సజ్జనులైన వారెవరుందురో వారిని రక్షింతుము. యిది తప్పరాదు. ధర్మము నిజమైతే యిది నిజమయ్యీని, వేదవాక్యాలు ప్రమాణమైతే యిది ప్రమాణమయ్యీని, భూత భవిష్యద్వర్తమాన కాలానుకున్ను నానా దేశాలకున్ను వ్రాయించినది మూడులక్షల ౩౨ (32) వేల గ్రంధములు. వీరభోగ వసంతరాయలు రాజ్యము యేలేది ౧౦౮ (108) యేండ్లు. వారి సాంప్రదాయకం వారు చేసేది వెయ్యేండ్లు. యీ తీరున ఈ పత్రిక లిఖించి వీరప్పయ్యగార్లు ఆనందాశ్రమములకు వినిపించెను. సంతోష చిత్తుండాయెను. యీ పత్రిక రాయపట్టణాల వివరం.

    ప్రథమాశ్వాసము సంపూర్ణం.


Donate Now