
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము
-
భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము
(శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)
(1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)
ప్రధమాశ్వాసము
శ్రీ వీరప్పయ్యగారు అన్నాజయ్యతో భూత భవిష్యద్వర్తమానంబులు చెప్పిన క్రమము
ముందు తాను బ్రహ్మలోకంబున డెబ్బదిరెండు (72) బ్రహ్మకల్పంబులు రాజ్యపరిపాలన చేసినానని చెప్పెను. అందుండి రజితాద్రికింబోయి యాబై మూడు (53) బ్రహ్మకల్పంబులు వుండితిమి.
అందుండి వైకుంఠమునకు బోయి మూడువేల (3000) యోజనాల పొడవున కూర్మసింహాసనము గావించి, అక్కడ ముపైమూడు (33) బ్రహ్మకల్పంబులు రాజ్యపరిపాలనముజేసి, వైకుంఠములో తిరుగ మాధవానంత సేవ, యిన్నూట తొంబైయేడు (297) బ్రహ్మకల్పములు చేయగా మాధవస్వామి చతుర్విధముక్తి యిచ్చెను. ఆ మీదట స్వామి, వైకుంఠములో పది (10) దివ్యవర్షంబులుండి బనగానిపల్లెకు ఆదికాలమందు భూప్రదక్షణంబులు నూటా యాబై (150) మార్లు జేసి సిద్దాంత శిరోమణియయిన ఆనందా శ్రమముల వద్ద సకలవిద్యల నభ్యసించి, వెయ్యిన్నీ మున్నూరు యేండ్లు (1300), ‘సోభ్యం’ ‘సోభ్యం’ అను యోగశాస్త్రమును ౧౯౦౦౦ (19000)ల గ్రంథములను నభ్యసించి కాలమృత్యువును కడజేసి, ఆ యోగంబుచే దివ్యశరీరినై ౩౩౩౩ (3333) బ్రహ్మకల్పంబులుండితిమి.
అదిమొదలు అవతారమూర్తినై ప్రధమావతారమున, ఆనందా శ్రమమునకు శిష్యుండనై ౯౯౯ (999) కోట్లు ౭౬౬౫ (7665) బ్రహ్మకల్పంబులుండితిమి. రెండవ అవతారమున ఆనందాశ్రమములకు శిష్యుండనై ౭౬౫ (765) బ్రహ్మకల్పంబులుండితిమి. తిరుగా మూడవ అవతారంబెత్తి ఆనందా శ్రమములకు శిష్యుడనై ౧౮ (18) వేల యేండ్లు వుండితిమి. తిరుగా నాలుగో అవతారంబెత్తి, ఆనందాశ్రమములకు శిష్యుండనై ౧౧౭౦ (1170) బ్రహ్మకల్పంబులుండితిమి. ఆ మీదట అయిదో అవతారంబెత్తి ఆనందా శ్రమములకు శిష్యుండనై నాల్గు ఖర్వాలున్ను మున్నూట యాబై (350) బ్రహ్మకల్పంబులుండితిమి. తిరుగా ఆరో అవతారంబెత్తి ఆనందాశ్రమములకు శిష్యుండనై డెబైయేడు (77) కోట్ల యిన్నూట ముపైయేడు (237) బ్రహ్మకల్పంబులుండితిమి. అటుతర్వాత యేడవ అవతారంబెత్తి ఆనందా శ్రమములకు శిష్యుండనై, ఆరువందల ముపై అయిదు (635) బ్రహ్మకల్పంబులుండితిమి. పునహా యెనిమిదో అవతారంబెత్తి ఆనందా శ్రమములకు శిష్యుండనై ౨ (2) లక్షల రెండువేల అరవై (207) బ్రహ్మకల్పంబులుండితిమి. తొమ్మిదో అవతారంబెత్తి ఆనందాశ్రమములకు శిష్యుండనై, యజ్ఞేంద్రునకు కుమారుండనై, ౨౩,౩౬,౦౩,౩౬౦ (23,36,03,360) బ్రహ్మకల్పంబులుండితిమి. ఆ మీదట పదో అవతారం బెత్తి, ఆనందాశ్రమములకు శిష్యుండనై ౭౦ (70) కోట్ల ౩౬ (36) లక్షలున్నూ కనిగిరి నివాసుండనై ౭౦౬౬౫ (70665) యేండ్లు యుండితిమి. తిరుగా పదకొండో అవతారమున మనుష్య అవతారం వికారినామ సంవత్సర ఆషాడ శుద్ధ ౧౩ (13)ల నాడు విడిచి అంతట ఆది ఆరభ్యం యేండ్లు ౩౨ (32) అయిన వెనుక తిరుగా వీరభోగవసంతరాయులదే సింహాసనమన్నారు. గనుక నందిమండల క్షేత్రమున పరబ్రహ్మవంశమున ప్రఖ్యాతమయ్యీని గనుక అందుకు
-: రాయపట్టణాల వివరం :-
శాలివాహనశక వర్షంబులు ౧౨౫౮ (1258) అగు నేటికి ధాతనామ సంవత్సర వైశాఖ శు॥ ౨ (2) లు హరిహరరాయలు ౭ (7) యేండ్లు, అతని తమ్ముడు ౭ (7) యేండ్లు, వుభయం ౧౪ (14) యేండ్లు యేలెను. అతని తమ్ముడు బుక్కరాయలు, పట్టణము గట్టుకొని యేలిన యేఁడ్లు ౨౯ (29) నెలలు ౮ (8) రెండవ హరిహరరాయలు పట్నం గట్టుకొని యేలిన యేండ్లు ౨౨ (22), విజయ బుక్కారాయలు యేలిన యేండ్లు ౧౭ (17). పల్లె బుక్కారాయులు యేలిన యేండ్లు ౧౬ (16), గండ దేవరాయలు యేలిన యేండ్లు ౨౧ (21), రాజు శేఖరరాయలు యేలిన యేండ్లు ౬ (6), విజయ బుక్కారాయలు యేలిన నెలలు ౧౦ (10), ప్రౌఢ దేవరాయలు యేలిన యేండ్లు ౨౧ (21), విరూపాక్షరాయలు యేలిన యేండ్లు ౪ (4), మల్లికార్జునరాయలు యేలిన యేండ్లు ౬ (6), రామచంద్రరాయలు యేలిన ఏండ్లు ౧ (౧), రెండవ హరిహరరాయలు యేలిన యేండ్లు ౧౨ (21), అంతట కురుపట్నాలు ఏలిన ఏండ్లు ౧౩ (13), అతని కుమారుడు వీరనారసింహులు యేలిన యేండ్లు ౧౩ (13), తమ్మురాయలను జంపించి రక్తాక్షినామ సంవత్సరం ఆరభ్యముగాను యేలిన యేండ్లు ౫ (5), నరసరాయుని రెండవ కుమారుడు కృష్ణదేవరాయలు శుక్ల నామ సంవత్సర, వైశాఖమాసం ఆరభ్యముగాను యేలిన యేండ్లు ౨౧ (21), అచ్యుతరాయలు కుమారుని జంపించి యేలిన నెలలు ౮ (8), శోభకృతునామ సంవత్సరం జ్యేష్టమాసం ఆరభ్యంగాను సదాశివరాయులను, ముందర బెట్టుకొని రామరాజు ఏలిన యేండ్లు ౨౨ (22), రామరాజుతో విజయనగరం కడ అయిపోయెను. గనుక అవాతరం ఏండ్లు ఏడు అటు తర్వాత, ప్రమోదూత నామ సంవత్సరాన తిరుమలరాయడు పెనుగొండ పట్టణము గట్టుకొని ఏలిన నెలలు ౧౦ (10), అతని కుమారుడు, శ్రీరంగరాయలు ఏలిన ఏండ్లు. అంగీరసనామ సంవత్సర ఆషాఢ శు ౫ (5)లు ఆరభ్యంగా ఏలిన ఏండ్లు ౧౫ (15), పార్థివనామ సంవత్సర మాఘమాసం ఆరభ్యంగాను వెంకటపతి రాయలు ఏలిన ఏండ్లు ౨౮ (28) నెలలు ౭ (7) దినములు ౧౫ (15), ఆమీదట సోమవంశము వారికి పట్నాలు లేవు గనుక పట్నాలు గట్టుకొనక ఏలినది చిక్కారాయలు ఏలిన నెలలు ౪ (4) రామదేవరాయలు ఏలిన ఏండ్లు ౧౫ (15) ఆ మీదట సోమవంశమువారికి పట్నాలు లేవు. గనుక అనంతరము ఏండ్లు అయిన వెనుక, బహుధాన్యనామ సంవత్సర, నందననామ సంవత్సర మధ్యమందు, పుట్టేటి వుత్పాతాలు చెప్పెదము. పర్వతాన మల్లికార్జునుని గుడిలో పొగమంటలు వెళ్ళిని, గుళ్ళల్లో దేవుళ్ళకు మూర్తివంతాలు వొచ్చి వూరవూర నాట్యమాడీని, దోషకారులకు చింతలుబుట్టీని, శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడిపొయ్యీని, వీరవసంత రాయులు వచ్చీని, అని చెప్పీని, అపవర్షము కురిసీని, కంచి కామాక్షమ్మ వుగ్రమువల్ల దక్షణదేశం దొరలు, శిశువులు, ప్రజలు నష్టమై పొయ్యేరు.

