
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
ఈశ్వరమ్మగారు శిష్యులతో దూరప్రాంతము సంచారం వెళ్లెను. మఠములో కమలమ్మగారు అత్తమామల సమాధుల పూజించి కొంతసేపటికి ఆకస్మికముగా కన్ను మూసెను. ఈశ్వరమ్మగారు దూరప్రాంతములో నున్నందున చెప్పేవారెవరు లేనందున కమలమ్మ భౌతికదేహాన్ని ప్రక్కననే ప్రవహించె నది అవతలి ఒడ్డున సమాధి చేసిరి. అదే రాత్రి కమలమ్మ దూర ప్రాంతముననున్న ఈశ్వరమ్మగారికి కలలో కనుపించి వదినమ్మగారు నన్ను నది అవతలి ఒడ్డున పాతిపెట్టినారని చెప్పుకొనగా ఈశ్వరమ్మగారు సంచారము ముగించుకొని తిరిగి కందిమల్లయపల్లెకు వచ్చి కమలమ్మగారి సమాధిని చూచెను. అప్పుటికి కమలమ్మ కుమారుడు శంభులింగానికి రెండు సంవత్సరముల వయస్సు ఆ బాలుని ఈశ్వరమ్మ గారే పెంచుచుండెను. మూడు సంవత్సరాలకు పెద్ద వర్షము వచ్చి నది పొంగి పారు చుండెను. ఆ ప్రవాహములో కమలమ్మగారి సమాధి నీటిలో కొట్టుకొని పోయెను ప్రవాహము తగ్గిన తదుపరి అదే స్థానములో కమలమ్మ గారి భౌతిక దేహము చెక్కు చెదరకుండ ఉండుట ప్రజలు చూచి ఈశ్వరమ్మగారికి తెలియజేసిరి. ఆమె స్వయముగా అచ్చటికి వెల్లి చూచి కమలమ్మ భౌతిక దేహాన్ని అచటి నుండి తెప్పించి ఆమె మఠము ప్రాంగణములో మళ్లి సమాధి చేయించెను.
బాల శంభులింగం ఈశ్వరమ్మగారి చేతులలో గారాబముగా పెరుగుచు, అయిదు సంవత్సరముల ప్రాయుడు ఆయెను. ఈశ్వరమ్మగారు ప్రతి దినము సాయంత్రము తన మఠములో భక్తులకు కాలజ్ఞానము బోధించుచుండెను. శంభులింగం ఆమె ప్రక్కలో కూర్చొని ఆమె చెప్పుచున్న కాలజ్ఞాన వాక్యములలోని నెరసుల సవరించి ఎప్పటికప్పుడు చెప్పుచుండెను. ఆమె ఆశ్చర్యపడుచు బాబూ! ఈ చిన్న వయసులో ఇంతజ్ఞానము నీకెవరు చెప్పిరనగా !
అత్తమ్మా! నీవు చిన్ననాడు నా వయసులో నున్నపుడు మీ జేజనాన్న జేజమ్మ గారితో గురుగోప్యమైన రహస్యము కుడి ఎడమ నడుమ ఆడే దాని పేరు చెప్పమని అడిగితివి గదా ! అది నీకెవరు బోధించిరని అడిగెను.
ఆమె ఆశ్చర్యపడుచు కాలజ్ఞానములోని
అయిదేండ్ల బ్రాహ్మణబాలుడు
చదువకనే వేదమంత్రాలు చదివీని
అను వాక్యము జ్ఞప్తికి తెచ్చుకొని ఈ వంశములో పుట్టదగినవాడె పుట్టినాడు అనుకొనెను. ఆ బాలునికి సప్తవర్ష ప్రాయము రాగానే ఒకనాడు తన వ్రేలితో ఆకాశమువైపు చూపుచు అత్తమ్మా! మీరిన్నాళ్ల నుండి నన్ను గారాబముగా పెంచితిరి. ఇపుడు నన్నెత్తుకొని పోవుచున్నాడు మీ జేజనాన్న అనుచు అచటనే జీవన్ముక్తుడాయెను. * బాలశంభులింగం బాలబ్రహ్మయోగియని తెలిసికొన్న ఈశ్వరమ్మగారు ఆమె తల్లి గిరిరాజమ్మ సమాధి ప్రక్కనే సమాధి చేయించెను. తన తల్లితో పాటు పూజలందుకొమ్మని దీవించెను. ఈశ్వరమ్మ గారు ప్రజలకు భక్తులకు మఠము ప్రాంగణములో ప్రతి దినము సాయంత్రము యధావిధిగా కాలజ్ఞానము బోధించుచు వారికి జ్ఞానోదయము కలుగజేయు చుండెను. ప్రతి దినము వందలాది ప్రజలు వచ్చి ఈశ్వరమ్మగారు చెప్పుచున్న కాలజ్ఞాన వాక్యముల సారాంశం వినుచు సంశయములు తీర్చుకొను చుండిరి.
* కందిమల్లయపల్లెలో గల ఈశ్వరమ్మగారి మఠములో బాలబ్రహ్మయోగి శంభులింగంగారి సమాధిని నేటికి దర్శించవచ్చు.
ఒకనాడు చుట్టు గ్రామాల ప్రజలు ఆ గ్రామ ప్రజలందరు వచ్చీ ఈశ్వరమ్మగారికి నమస్కరించి మాతేశ్వరీ వీరబ్రహ్మేంద్రస్వామి విరచిత కాలజ్ఞానములోని ముఖ్యాంశాలు తేల్పుడని ప్రార్థించగా ఈశ్వరమ్మగారు ఇట్లు బోధించిరి.
భూత భవిష్యద్వర్తమానకాలానకు
నానాదేశాలకు వ్రాయించినది మూడు
లక్షలముప్పది రెండు వేల గ్రంథాలు, అని వ్రాసినారు.
భూతకాలము అనగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవతరించక పూర్వము శ్రీవారి తొలి అవతారాలను గూర్చి చెప్పిన వివరములు.
వర్తమాన కాలమునగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవించి యున్నపుడు నడుచుచున్న వివరములు. ఆయన సమాన మహర్షుల సంభాషణ దేవ రహస్యములు
భవిష్యత్కాలము అనగా ! శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన తదుపరి కలియుగములో జరుగబోయే వింతలు విశేషాలు
ఈ మూడు కాలాలలో జరిగినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి సవిస్తారముగా తెలిపినారు. ఈ వాక్యముల సారాంశములు తెలిసికొని నడుచుకొనిన కొన్ని ఆపదలను తప్పించుకొందురు. అది విని భక్తులు మరల ఇట్లు ప్రశ్నించిరి ఓ జగజ్జననీ మాతా! కలియుగములో జరుగబోయే వివరముల గూర్చి తెలపుడని ప్రార్థించగా భక్తులారా
దొంగలు ధొరలగుదురు
బందిపోట్లు పొడిచేరు అని వ్రాసినారు.
రాయలు గజపతుల రాజ్య పరిపాలన తదుపరి రాజులు ధర్మము దప్పి నడుచుట వలన కలహములు చెలరేగును. ప్రజలుకూడ ధర్మము దప్పి అకారణ కలహములు పెంచుకొనుచు అన్నతమ్ముల మధ్య తండ్రికొడుకుల మధ్య విరోధములు గలిగి విడిపోదురు. రాజుల మీద బంట్రోతులు గురువుల మీద శిష్యులు తిరుగబడుదురు. అసత్యాలు, ఆక్రమాలు హెచ్చి పోవును. యువకుల నాయకత్వము స్త్రీల నాయకత్వము అధికమించి ఒకరిమేలు మరియొకరు ఓర్వలేక పోయేరు. పెద్దల పెత్తనాలను సాగనీయరు. దొంగలకు దొరతనాలు వచ్చును. బంధిపోట్లు వారిని వెంబడించి పొడిచి చంపుదురు. ఈలాంటి ప్రళయాలు సంభించు చుండును. అని చెప్పగా విని మరలనిట్లు ప్రశ్నించిరి.

