శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • కొంతకాలమునకు గోవిందమాంబ జీవన్ముక్తి పొందెను. తదుపరి పార్వతమ్మ స్వర్గస్థురాలు ఆయెను. మరి కొన్నాళ్లకు పోతులూరయ్య గారు శివైక్యమొందిరి. వీరి ముగ్గురుని వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి ముందు ప్రాంగణములో సమాధులు చేసిరి. నేటికి దర్శించవచ్చు.

    ఈశ్వరమ్మగారి చరిత్ర

    ఈశ్వరమ్మగారు తన పంచవర్ష ప్రాయముననే జేజనాన్న వీరబ్రహ్మేంద్రస్వామిచే మంత్రోపదేశము బొంది “శక్తిదీక్ష” వహించి అష్టవర్ష ప్రాయము వరకు అష్టసిద్దులు సాధించి బ్రహ్మచారిణిగా నుండి తత్వజ్ఞానురాలు ఆయెను.

    జేజనాన్నగారి సజీవసమాధి ప్రాంగణములో పూర్వదిశలో చిన్న కుటీరము వేసికొని దానిలో తపస్సు చేయుచు జేజనాన్నగారి సజీవ సమాధిని ప్రతిదినము పూజించు చుండెను. దాని సమీపమునందె తండ్రి గోవిందయ్యస్వామి కుటీరము వేసికొని దానిలో ప్రాణాయామము చేయుచుండెను.

    ఒకనాడు గోవిందయ్యస్వామి ప్రతిదినము వలెనె బ్రాహ్మముహూర్తమున ప్రాణాయామము చేయుచుండగా అది ఊర్థ్వమందే ఆగిపోయెను. తెల్లవారి చాలా ప్రొద్దెక్కిన బయటికి రానందున భార్య గిరిరాజమ్మకు అనుమానము గలిగి పూజాసమయమైన తన భర్త ఎందుకు నిద్రనుండి మేల్కొన లేదని తలుపు తెరిచి లోపలికి వెళ్లి తన భర్తను లేపిన మేల్కొనకుండా కదలక, మెదలక పరుండునది చూచి భయపడి ఏడ్చుచుండెను. అంతలో ఈశ్వరమ్మ గారు అక్కడికి వచ్చి తండ్రిగారి నాడిని పరీక్షించి అమ్మా! నాన్నగారికి ఏమి కాలేదు అపాయ మేమిలేదు. తపోనిష్ఠలో ప్రాణవాయువు ఊర్ధ్వమున నిలిచి పోయినది. మీరందరు బయటికి వెళ్లండి నేను తండ్రిగారి ప్రాణవాయువును అదోముఖముగా పట్టించి మేలుకొలిపెదను అని అందరిని బయటికి పంపించి తలుపులు మూసి తానొక్కతే తండ్రిగారి ప్రక్కలో కూర్చొని మెల్లె మెల్లెగా ప్రాణవాయువును క్రిందికి దింపెను. గోవిందస్వామికి మెలకువ వచ్చి చూడగా ప్రక్కలో ఈశ్వరమ్మ కనిపించెను.

    అమ్మా! ఈశ్వరిదేవీ! నేను వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రథమ పుత్రుడుగా జన్మించి తండ్రిగారిచే మంత్రోపదేశము బొంది దాని ఫలితము సాధించలేక పోయితిని ఇక నా జీవితమంతా ఇంతే నీవు చిన్న వయసులోనే జేజనాన్నగారి సమానముగా సాధించితివి. అమ్మా! నా అంత్యము సమీపించు చున్నది. నీవైన ఈ లోకములో మీ జేజనాన్నగారి వలె ప్రజలతో పూజలందు కొనుచుండుము అని ఆశీర్వదించెను.

    నాన్నగారూ! మీరు గూడ జేజనాన్న గారివలెనే మీకు కూడ ఇక్కడ పూజలు జరుగును. మీ పూజలు జరిగిన తదుపరి నాకు పూజలు జరుగునని చెప్పగ విని, గోవిందయ్యస్వామి సంతసించి చెల్లెలు వీరనారాయణమ్మను ఆమె భర్త వెంకటాద్రయ్యను పిలిపించి తండ్రిగారి ఆజ్ఞానుసారము మఠాధిపత్యము వారికి అప్పగించి తరతరాలు మీ వంశము వృద్ధిజెందుచు ఈ మఠమునకు మఠాధిపతులుగానె యుండుడని ఆశీర్వదించి తాను సమాధి జెందెను. ఈశ్వరమ్మగారు తండ్రిగారి సమాధిపై గుడికట్టి ప్రతిదినము ముందు జేజనాన్నగారి సజీవసమాధిని పూజించి, తర్వాత తన తండ్రిగారి సమాధిని పూజించుచుండెను. మరికొన్నాళ్లకు తల్లి గిరిరాజమ్మ ముక్తి పొందెను. ఆమెను తండ్రిగారి సమాధికెదురుగా సమాధి చేయించెను. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో గల రూపినగుంట్ల గ్రామములో లంకెనపల్లి శివకోటయ్యాచార్యులు వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడు వీరి ధర్మపత్ని దేవవరం గురులింగాచార్యులు కూతురు ఈమె కూడా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తురాలు ఈ దంపతులకు వీరాచార్యులు, వీరనాగయ్యాచార్యులు, వీరమల్లికార్జునాచార్యులు వీరభద్రయ్యా చార్యులు, వీరసుబ్బయ్యాచార్యులను అయిదుగురు కుమారులు కలిగిరి.

    నలుగురు పెద్దవారు గృహస్థాశ్రమ ధర్మము పాటించుచు జీవనము గడుపుకొను చుండిరి. అయిదవ కుమారుడు వీరసుబ్బయ్యాచార్యుడు బ్రహ్మచర్యము వహించి వీరబ్రహ్మేంద్రస్వామిని పూజించుచూ జనన, మరణ రహిత మార్గము దెల్పుమని ప్రార్థించుచుండెను. ఒకనాడు వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న దర్శనమిచ్చి నా మఠములో ఈశ్వరీదేవి గలదు. ఆమెను ఆశ్రయించు నీ సంశయములు తీర్చగలదని చెప్పి అదృశ్యుడాయెను. ఉదయమే తల్లిదండ్రులతో సెలవు తీసికొని కందిమల్లయపల్లెకు వచ్చి, ఈశ్వరమ్మగారిని దర్శించి సాష్ఠాంగా దండప్రణామము లాచరించి ఓ భగవతీ! నన్ను కరుణించి నాకు బ్రహ్మ జ్ఞానోపదేశము చేసి కృతార్థుని జేయుమని వేడగా

    సుబ్బయ్యాచార్యా! నీ మనోభావము నాకు తెలియును. జేజనాన్నగారు నీకు స్వప్న దర్శనమిచ్చి నా దగ్గరికి పొమ్మని చెప్పినది తెలియును. నీవు ఇచటనే యుండుమని చెప్పి ఆశీర్వదించెను. ఆనాటినుండి సుబ్బయ్యాచార్యులు ఈశ్వరీదేవికి పాదసేవజేయుచు ఆ దేవికి శిష్యుడై మంత్రోపదేశము పొందెను. ఈశ్వరమ్మగారు అతనిని వెంట వుంచుకొని సంచారము చేయుచు భక్తుల సంశయములు తీర్చుచు, కాలజ్ఞానము బోధించుచు అడిగిన భక్తులకు మంత్రోపదేశము చేయుచుండెను. ఈశ్వరమ్మగారి తమ్ముడు ఓంకారమయ్య సంచారము చేయుచు తంగళ్లపల్లె గ్రామములో పాపయ్యాచార్యులింటిలో గురుపీఠమును స్థాపించి పూజించుచుండగా చుట్టు గ్రామాలవారు వచ్చి తీర్థప్రసాదములు తీసికొని వెళ్లుచుండరి. చాలాకాలము అచటనె యుండుట వలన పాపయ్యాచార్యుల కూతురు కమలమ్మ ప్రతి దినము పీఠపూజకు పూజసమయానికి పూజాద్రవ్యాలు తెచ్చి ఇచ్చు చుండెను. వారిద్దరికి సన్నిహిత ప్రేమ కలిగెను. కమలమ్మ ఓంకారమయ్య గాంధర్వ వివాహము చేసికొనిరి. చాలా కాలము అచటనే యుండిరి. కొన్నాళ్లకు వారికి కుమారుడు కలిగెను. ఆ బాలునికి శంభులింగం అను నామకరణము జేసిరి.

    ఈశ్వరమ్మగారు సంచారము ముగించుకొని కందిమల్లయపల్లెకు రాగానె ఓంకారమయ్య పుత్రుడు కలిగినాడు తంగళ్లపల్లెలో యున్నాడని తెలిసెను. చిన్న తమ్ముడు సాంబమూర్తిని తోలించి ఓంకారమయ్య కమలమ్మ దంపతులను ఆ బాలుని పిలిపించుకొని తన దగ్గరనే యుంచుకొనెను. ఈశ్వరమ్మగారు సంచారము వెళ్లినపుడు తల్లిదండ్రుల సమాధులను ఓంకారమయ్య కమలమ్మగారే పూజించుచుండిరి.