
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
ఇది కలికాలము ప్రజలకు అట్టి నమ్మకాలు కలిగినపుడే భగవంతుడని, గురువని నమ్ముదురు మీరు అనుమతిస్తే తండ్రిగారి జీవ సమాదిని మూతదెరిచి చూతుననగా! విని కుమారా! లోక వాక్యము నాకు అవసరము లేదు పతి వాక్యము పాటించులే సతికి ధర్మము నీవు తొందరపడిన ప్రమాదానికి దారి తీయవచ్చు. ఈరోజు మీ తండ్రిగారి జీవసమాధిని పూజించి రాత్రికి పడుకొనునపుడు నీ మనసులోని మాటను విన్నవించుకొని శయనించుము. మీ తండ్రిగారు స్వప్న దర్శనమిచ్చి ఏమి చెప్పునో అటుల నడుచుకొనుట మంచిదని చెప్పెను. పోతులూరయ్యగారు తల్లి చెప్పినట్టు చేసి రాత్రికి శయనించునపుడు ఓ తండ్రీ! లోకాపవాదం భరించ లేకున్నాను మీ మహాత్యము ప్రజలకు నమ్మకము గలుగుటకై మీ జీవసమాధిపై కవాటము తొలిగించి చూతును అనుమతించ గలరని ధ్యానించి పరుండెను.
వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న దర్శనమిచ్చి కుమారా! నా జీవసమాధి కవాటము తెరిచిన నీవు ముక్కంటి మూడవకన్ను తెరిచి చూడగ మన్మథుడు భస్మమైనట్లు అగుదువు నీకీ చపల బుద్ది గలినందుకు నీవు ఈ స్థానము వదిలి నీ పత్నితో అరణ్యమునకు వెళ్లి కొండమీదిపల్లె సమీపమున ప్రవహించు సెలయేరు ఒడ్డున చింతచెట్టు గలదు దానికింద పన్నెండేండ్లు తపస్సు చేయు చుండుము ఆ చెట్టు పండొకటి నీ చేతిలో పడినపుడు నీ తపస్సు ఫలించునని చెప్పి అదృశ్యుడాయెను.
పోతులూరయ్యకు మెలుకువ గలిగి స్వప్న వృత్తాంతము తల్లితో చెప్పి భార్యను తోడుకొని కొండమీదిపల్లెకు వెళ్లి తపస్సు చేయుచుండెను. ఏటికి నీటి కొరకై వచ్చు ఆ గ్రామ ప్రజలు ఆ స్వామిని చూచి ప్రతి దినము పాలు, పండ్లు తెచ్చి ఇచ్చుచుండిరి. అదే గ్రామ పాపరాయ యాదవస్వామి వారికి సేవజేయుచు శిష్యుడు ఆయెను.
ద్వాదశ వర్షములైన తదుపరి పోతులూరయ్య ఆ నదిలో స్నానముచేసి సూర్యార్ఘ్యము విడుచునపుడు ఆ చెట్టుపై నుండి పండొకటి ఆయన దోసిలో పడెను. అపుడు ఆస్వామి తన తపస్సు ఫలించినదని సంతోషించి పాపారాయుని బిలిచి నేను కందిమల్లయపల్లెకు వెళ్లవలెను. నీవిచటనే తపస్సు చేయు చుండుము మోక్షము పొందగలవని చెప్పగా ఓ స్వామీ! మీ ఆజ్ఞ శిరసా వహించెద పూజించుటకు తమ పాదుకలు ఇవ్వగలరని ప్రార్థించగా పోతులూరయ్యస్వామి తన పాదుకలను పాపరాయునకిచ్చి ఆశీర్వదించి తన భార్యను తోడుకొని వెళ్లెను. తదుపరి అచట పాపరాయుడు ఆలయము గట్టించి పాదుకలను ప్రతిష్ఠించి పూజించుచుండెను. నాటి నుండి ఆ నదికి పోతులూరయ్య సెలయేరని వాడుక గలిగెను. ప్రతి శివరాత్రికి అచట పోతులూరయ్య పాదుకలకు ఘనముగా ఉత్సవము జరుపుచున్నారు. నేటికి దర్శించవచ్చును.
పోతులూరయ్యస్వామి దంపతులు నడిచి వస్తుండగా రాత్రి అగుట వలన ఆ సమీప గ్రామము రామాపురము చేరగనే ఏరువ పెద్దన్న ఎదురేగి దంపతులను తోడుకొని వచ్చి తన ఇంటిలో యుంచుకొని మరునాడు ఉదయమే పెద్దన్న ఆ స్వామితో ఇట్లు అనెను.
ఓ స్వామీ! నేనులింగాయుతుడను మా ఇంటి పేరు ఎరువవారు నా పేరు పెద్దన్న నేను సదా వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటమును పూజించు చున్నాను. మీ దర్శనార్థమై కొండమీదిపల్లెకు వస్తుండగా మార్గమధ్యలో ఓ మహనీయుడు ఎదురై పెద్దన్నా నీవక్కడికి వెళ్లవద్దు కొలది రోజులలోనే అతడే మీ ఇంటికి రాగలడని చెప్పుచు అంతలోనే కనుపించకుండ వెళ్లెననగా! పెద్దన్నా నీకు దర్శనమిచ్చినది నీవు పూజించుచున్న ఆ వీరబ్రహ్మేంద్రస్వామియే నా తపస్సు భంగము కాకుండగా నిన్ను అచటికి రావద్దని చెప్పి, నన్నే మీ ఇంటికి రప్పించినాడు. నీ సంశయములు ఏవైన యున్నచో చెప్పుమనగా
ఓ స్వామీ! నేను బ్రహ్మచర్యము వహించి అడవిలో ఏకాంతముగా నుండి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిని ధ్యానించు చుండగా నా తల్లిదండ్రులు బలవంతముగా తోడుకొని వచ్చి పెండ్లి చేసికొని నీ వంశవృద్ధి పరచినా అదే పుణ్యమని బలవంతం చేయుచున్నారు.
మీ ఆజ్ఞ కొరకై ఇన్నాళ్లు వేచియున్నాను మీ యాజ్ఞ శిరసా వహించెదను నేను ఏ మార్గమున నడువలెనో తెలుపుడని ప్రార్థించగా!
పెద్దన్నా! చతురాశ్రమ ధర్మము పాటించుట మానవుని ధర్మము ఇన్నాళ్లు బ్రహ్మచర్యము వహించితివి ఇపుడు గృహస్థాశ్రమ ధర్మము పాటించుచు అరవై సంవత్సరముల వయసులో వానప్రస్తాశ్రమ ధర్మము పాటించి పుణ్యక్షేత్రములు దర్శించుచు డెబ్బది ఏండ్ల వయస్సు రాగానే సన్యాసాశ్రమ ధర్మము స్వీకరించి శ్రీశైల సమీపమునగల లింగాలకొండలో ఏకాంతముగా తపస్సు చేయుచు ముక్తి బొందుమని మంత్రోపదేశము చేసి ఆశీర్వదించి వెళ్లెను.
మార్గమధ్యలో అల్లీనగర గ్రామప్రజలు ఎదురేగి ఆ స్వామిని తోడుకొని తమ గ్రామములో పాదపూజచేసి ఓ స్వామీ! మా గ్రామ దేవత పోలేరమ్మ మా గ్రామ ప్రజలను చాలా బాధిస్తున్నది. ఈ ఆపదల నుండి రక్షించేది మీరేయని ఒక మహనీయుడు చెప్పెను అని ప్రార్థించగా
ఆ స్వామి మరునాడు ఆ గ్రామస్థులచే తూమెడు బియ్యము అన్నము వండించి దానికి తగినంత పప్పు పానకము చేయించి పోలేరమ్మ గుడిముందర అన్నమంతా రాశిగా పోయించి ఆస్వామి గుడిలోపలికి చూచి పోలేరి బయటికిరా అని పిలువగా! పోలేరమ్మ తెల్లని చీరకట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని వెంట్రుకలు విరియ బోసుకొని బయటికి వచ్చి ఆ స్వామికి నమస్కరించి నిలుచుండెను. ఆ స్వామి జూచి ఓ పోలేరీ ఈ పప్పన్నము తిని పానకము త్రాగుమని చెప్పెను.
పోలేరమ్మ పది నిమిషములలో పప్పన్నము తిని పానకము త్రాగి ముకుళిత హస్తమై ముందు నిలువగా ! ఆస్వామి జూచి పోలేరీ నేటినుండి ప్రజలను బాధించవద్దని చెప్పగా
ఓ స్వామీ! కలియుగములో ఈ ప్రజల నడకల వలన అధర్మాలు అక్రమాలు ప్రబలుచున్నవి. దీని వలన ధర్మదేవత నిలుచుటకు స్థానము లేకుండా పోవుచున్నది. వీరిని పీడించకున్న ధర్మదేవతకు పూర్తిగా స్థానమే లేకుండ పోవునని చెప్పగా విని పోలేరీ! నీవు నా వెంటరమ్మని కందిమల్లయపల్లెకు తోడుకొని వెళ్లి ఆ గ్రామ పొలిమేర సందున ఒక చెట్టు చూయించి దీనిపై నివసించుము. మా తండ్రిగారి ఆరాధన ఉత్సవమునకు వచ్చిన భక్తులు నిన్ను గూడ దర్శింతురని చెప్పి ఆశీర్వదించి దంపతులు వీరబ్రహ్మేంద్రస్వామి మఠమునకు వచ్చి తల్లిగారికి పాద నమస్కారము చేసి జరిగినది చెప్పిరి.

