శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • ఒకనాడు ఆ స్వామి ఆ గ్రామ ప్రజలను ఆహ్వానించి ఆయ్యలారా! నేను సమాధి అగుకాలము సమీపించుచున్నది. మీకేమైన సంశయములున్న అడుగవచ్చును. నేను సమాధి అగుటకు భూగర్భ గుడి కట్టించండి. అనగా ఓ స్వామి ! మీ అనుజ్ఞ ప్రకారము చేయుట సిద్దముగా నున్నాము కాని మాదొక చిన్న కోరిక భక్తి జ్ఞానమును గూర్చిన వివరములు తెల్పుము. అనగా భక్తులారా! ప్రపంచములో ప్రతిమానవుడు ముక్తి బొందవలెనని కోరుట సహజమే కాని ముక్తి పొందుటకు రెండు మార్గములు గలవు.

    మొదటిది జ్ఞానమార్గము ఇది చాలా కష్టమైన మార్గము అనగా! ప్రపంచమంతా మిధ్య పరబ్రహ్మ మొకటే యని తెలిసికొనుట ప్రపంచమును కనులార జూచుచు మిధ్యగా నిరూపించుట కష్టసాధ్యము జ్ఞానమార్గమున పరమాత్ముని దర్శించినవారు ధన్యులు జనన మరణములు వీరిని అంటవు.

    రెండవది భక్తి మార్గము ఇది సులభ మార్గము పరబ్రహ్మ నామమును తనమనసులో లీనము చేసికొని ధ్యానించుట దీనిన సులభముగా సాధించవచ్చు భక్తి జ్ఞానములు రెండు భిన్నములు కావున ఒకదానికొకటి సంబంధించి యుండును అది ఎటులనగా! భక్తికి ముందు పరబ్రహ్మ తత్వమును తెలిసికొనుట జ్ఞానము అవసరము కనుక ఈ రెండు ఒకదానికొకటి సంభందం కలిగి ఉండును.

    ఈ భక్తి జ్ఞానము రెండింటి మధ్య వ్యతిరేకమైనది అహంకారము వున్నది. దానికి తావిచ్చిన మమకారము తొలిగిపోవును. పాపకార్యములు చేయ ప్రారంభింతురు. కనుక అహంకారానికి ఏ మాత్రము తావివ్వకూడదు. అందుకే కాలజ్ఞానములో ఇలా అన్నారు. అపకారము చేసిన వారిని నిర్మూలము చేస్తాము.

    యెవరెవరు నన్ను నమ్మి యున్నారో వారిని రక్షింతుము కా. పంచమా పేజీ 33

    భక్తులారా! నేను సమాధి కావటానికి భూ గర్భగుడి కట్టించండి. నేనిపుడు ఏకాంత వాసమందుండి సమాధికి ఒకరోజు ముందుగా బయటికి వత్తునని చెప్పి ఏకాంత వాసము వెళ్లెను.

    కందిమల్లయపల్లెలో ఈశ్వరమ్మగారు తనదివ్వదృష్టిచే దక్షణామూర్తి సమాధి సమీపించున్నది అని తెలిసికొని పినతండ్రి గిరిరాజయ్యను తోడుకొని సూరిశెట్టిపల్లెకు వచ్చి దక్షణామూర్తిగారికి నమస్కరించి పిన్నాన్న గారు అంత్యమున మీ ఆశీసులు పొందుటకై వచ్చినాను. అనగా ! విని

    కం|| అమ్మా! ఈశ్వరీదేవీ

    సమ్మతిగాజూడవమ్మ - శాశ్వితకీర్తిన్

    ఇమ్మహి జనములకెల్లన్

    మిమ్ముము పూజింపుచుండ - మేల్కొన గూడున్ ప్ర. నిష్ప్ర

    అని ఆశీర్వదించి ఈశ్వరీదేవి తండ్రిగారు కాలజ్ఞాన గ్రంథము నా చేతికిచ్చి పంపించిరి. దానిలోని గూడార్థములు ప్రజలకు ఇంతకాలము వరకు బోధించితిని అది పూర్తి కాలేదు నేను సమాధి అగుట సమీపించినది. మిగతా భాగము నీవు ప్రజలకు బోధించుచు అంత్యమున తండ్రిగారి సమాధి దగ్గర వుంచుమని చెప్పెను. గ్రామ ప్రజలందరు ఆ స్వామిని బ్రహ్మరథముపై ఘనముగా ఊరేగింపు జేయుచు సమాధి గర్తము దగ్గరికి వచ్చిరి దక్షణామూర్తి బ్రహ్మరథము దిగెను.

    ఈశ్వరమ్మ గిరిరాజయ్య దక్షిణామూర్తి గారిని వేద మంత్రములచే అభిక్షేపించి పట్టు పితాంబరములు గట్టించి గంధపుష్పాక్షతలచే అలంకరించిరి ఆస్వామి క్రీ॥శ॥ 1748 సరియగు విభవనామ సం||ర ఆశ్వీజ మాస శుక్ల పక్ష దశిమి శ్రవణానక్షత్ర భానువారమునాడు అందరిని ఆశీర్వదించుచు యోగాలయమునందు ప్రవేశించి పద్మాసమువైచి కూర్చుని యోగనిష్ఠలో పరిపూర్ణాచలుడు ఆయెను. తదుపరి ఈశ్వరమ్మ గిరిరాజయ్య సమాధి గర్తము పై మూత బిగించి పూజించి గ్రామ ప్రజలతో అయ్యలారా! దక్షణామూర్తి మీ గ్రామములో సమాధి చెందుట మీ పూర్వ జన్మపుణ్య ఫలము నిత్యపూజలు ఆరాధన ఉత్సవములు జరుపుచుండిన ఎడల మీ గ్రామమునకు శుభము గలుగునని ఆశీర్వదించి వెళ్లిరి.

    పోతులూరయ్య చరిత్ర

    పోతులూరయ్యగారు గురుపీఠము తీసికొని సంచారము చేయుచు ప్రజలకు కాలజ్ఞానము బోధించుచు వారు సమర్పించు కానుకలను దెచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సజీవసమాధికి నిత్యపూజలు, ఆరాధనలను జరుపుచుండిరి. పోతులూరయ్యగారు సంచారము జేయుచు వనిపెంట అను గ్రామమునకు వచ్చెను. ఆగ్రామ విశ్వబ్రాహ్మణులు ఆ స్వామితో వితర్క వాదము ఆడుచు ఇట్లనిరి.

    అయ్యా! తాము గురుపుత్రులమని చెప్పుకొనుచు గురుపీఠమును దీసికొని సంచారము చేయుచు మీరే మతాచారమునకు విరుద్ధముగా నడుచుకొనుట భావ్యమా! నీ తల్లి ఇంకనూ పసుపు, కుంకుమ అలరించుకొని సుకేతనిగా నున్నది కదా! ఆ గురుదేవులు ఇంకను జీవించినారని మాకు నిదర్శనమేమి ఆ నమ్మకము మాకు కలిగినపుడె మీచేత మేము తీర్థ ప్రసాదములు స్వీకరింతుము. అంతవరకు ముట్టము వచ్చిన దారిననే తిరిగి వెళ్లమని చెప్పగా, పోతులూరయ్య వారికేమి సమాధానము చెప్పకుండ అటునుండి వెళ్లి మునిమడుగు గ్రామమునకు వచ్చెను. అక్కడ గూడ అవే ప్రశ్నలు అడుగగా పోతులూరయ్య చింతాక్రాంతుడై ఏమి చెప్పచెప్పలేక ఎటుతోయక తిరిగి కందిమల్లయపల్లెకు వచ్చి తల్లితో చెప్పగా ఆమె ఆవేశము పట్టజాలక ఇట్లు శపించెను. “వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాడుగాను” “మునిమడుగు విశ్వబ్రాహ్ముణులు ముదనష్టంగాను”

    అనగా! పోతులూరయ్య విని, అమ్మా! ఇట్లు శపించుట ధర్మమా? మా తండ్రిగారు సమాధిలో సజీవముగా యున్నట్లు ప్రజలకు నమ్మకము గలుగాలి కదా! తండ్రిగారు సంచారము చేయునపుడు ఎందరో హేతువాదనలు చేయగా వారికి తగువైన సమాధానాలు చెప్పుచు కొన్ని నిదర్శనాలు గూడ చూయించెను.