
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
అదేరాత్రి దక్షణామూర్తికి వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న దర్శనమిచ్చి నేను సజీవసమాధి అగుచున్నాను దిగులుజేందక నా ఆజ్ఞను పాటించుచుండుమని చెప్పి అదృశ్యుడాయెను. దక్షణామూర్తికి మెలుకువ గలిగి స్వప్న వృత్తాంతము జ్ఞప్తికి తెచ్చుకొని ఉదయమే శిష్యులతో బయలుదేరి కందిమల్లయపల్లె సమీపమునకు రాగానె ఈశ్వరమ్మగారికి తెలిసి ఎదురుగా వెళ్లి
కం॥ వందనము జనకసోదర
వందనము మహానుభావ - వర్ణింతునునా
వందనము వసుధమానవ
బృందములకెల్ల భక్తి బెంపగుటకునై ప్ర. నిష్ప్ర.
పినాన్నగారూ! ఇక్కడకు మరిచి వచ్చితిరా! మనవులలో దైవభక్తి కలుగుటకు జేజనాన్న గారు మీకు బ్రహ్మచర్య దీక్షను ఇచ్చి కాలజ్ఞానము బోధించుమని చెప్పి పంపించెను. మీరు చేయు కార్యము చేయుడనగా అమ్మా! ఈశ్వరీదేవీ! తండ్రిగారి ఆజ్ఞానుసారము దేశము నలుదిశలు సంచరించుచు ప్రజలకు బాగుగా అర్థమగునట్లు కాలజ్ఞానములోని వాక్యముల సారాంశము బోధించుచున్నాను. ఇందులో నాలోపమేమి అని చెప్పగా ఈశ్వరమ్మగారు విని
కం|| చాలా విషయము లింకను
కాలజ్ఞానమునగలవు - కావున మీతో
కాలోచితముగ దెలిపితి
శీలుడవై జూడుమింక – చిన్నయగారు ప్ర. నిష్ప్ర
పిన్నాన్నగారూ ! జేజనాన్నగారు చెప్పిన విషయములు మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి కాలజ్ఞానము సంపూర్తిగా బోధించుటకు మీకీ జన్మచాలదు పొమ్మని చెప్పెనుగాని రమ్మని చెప్పలేదు గదా! మహాపురుషులు వాక్సుద్ధి గలవాడు మీరు ఏరుగనిది కాదని చెప్పునంతలో అగ్రజులు వచ్చుట జూచి వారికి నమస్కరించి అన్నలారా! మన తండ్రిగారు యోగాలయములో ప్రవేశించునపుడు నన్ను గూర్చి ఏమి చెప్పెననగా చిరంజీవీ! నిన్ను గూర్చి తండ్రిగారిని అడుగగా ఈ విధంగా చెప్పెను కుమారులారా! దక్షణామూర్తికి సమస్తము తెలిసికొనగల కాలజ్ఞాన గ్రంథమును యిచ్చి ఆశీర్వదించి పంపించినానని చెప్పినారనగా !
కం॥ అగ్రజులకు మ్రొక్కియు తా
విగ్రహమునబల్కెననమ - నేర్పునమియ
నుగ్రహమున సెలవొసగిన
జాగ్రత కలవాడనగుచు – జనియెదనిట్లే ప్ర. నిష్ప్ర
అగ్రజులకు పాదనమస్కారము చేసి భక్తులిచ్చిన కానుకలు వారిచేతికి ఇచ్చి
అన్నలారా! తండ్రిగారి సజీవసమాధిని దర్శించుట నాకు ప్రాప్తములేదని ఈశ్వరీదేవిని జూచి
కం|| అమ్మా ! ఈశ్వరిదేవీ !
పొమ్మని సెలవీయమ్మ - పోయెదనిటులే
సమ్మతిగగనజూపితివిక
సమ్మతిగబోదునమ్మ – సంతోషముతో ప్ర. నిష్ప్ర
అందరితో సెలవు తీసికొని ఊరి వెలుపలి నుండియె తిరిగి వెళ్లుచుండగా మార్గమధ్యలో సీతారామాపుర ప్రజలు వచ్చి దక్షణామూర్తిని పిలుచుకొని వారి గ్రామమువెళ్లి విడది గృహము నందు ఉంచి, పాదపూజచేసి వారిచేత వారము రోజులు కాలజ్ఞాన భావార్ధములు వినుచుండిరి.
అచటికి సూరిశెట్టిపల్లె గ్రామప్రజలు వచ్చి ఆ స్వామికి పాదాభివందనములు జేసి ఓ స్వామీ! మొన్నటి రాత్రి నడిరేయి జామున పిడుగులు పడినట్లుగా పెద్దశబ్దము మా గ్రామస్తులందరికి వినిపించెను. అది మా గ్రామమునకు యేమి ఆపద సంభవించునో అనుకొని గ్రామస్థులంతా గుమిగూడి విచారించుచుండగా అంతలో అటునుండి ఒక మహనీయుడు ఈ మార్గమున వెళ్లుచుమా యొక్క ఆవేదనలు గ్రహించి, అయ్యలారా! భయపడవలసిన అవసరము లేదు. సీతారామాపురములో దక్షణామూర్తిని కలువండి. మీ చింతలు తీర్చునని వెళ్లెను అని చెప్పగా! విని
అయ్యలారా! మీకు దర్శనమిచ్చి సలహా చెప్పినది మా తండ్రిగారు వీరబ్రహ్మేంద్రస్వామియె సమాధి గూడ మీ గ్రామమందె యున్నదని ఇంతకు పూర్వమే నాతో చెప్పియుండెను. అది మీ గ్రామమునకు క్షేమమే అని చెప్పగా ఓ స్వామి మీ ఆజ్ఞ శిరసా వహించెదము. మీరు మా గ్రామానికి దయ చేయుండని ప్రార్థించగా ఆ స్వామి వారివెంట సూరిశెట్టిపల్లెకు వెళ్లి అచట విడది గృహములో ఏకాంతముగా తపస్సు చేయుచుండెను.

