
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
నాటినుండి గోవిందయ్యాచార్యులు మఠాధిపతులుగా పోతులూరయ్యాచార్యులు సంచాలకులుగా నుండి నిత్యపూజలు సత్యముగా నడుపుచుండిరి.
వీరబ్రహ్మేంద్రస్వామి కుమారులు సంతానము
1. గోవిందయ్య గిరిరాజమ్మ దంపతులకు, ఈశ్వరమ్మ, కాళమ్మ, శంకరమ్మ, ఓంకారమయ్య, సాంబమూర్తి జన్మించిరి.
2. పోతులూరయ్య పార్వతమ్మ దంపతులకు నీలమ్మ యను ఒక కూతురు జన్మించెను.
3. ఓంకారమయ్య కామాక్షమ్మ దంపతులకు సంతానము లేదు.
4. గిరిరాజయ్య పాపమ్మ దంపతులకు వేంకటాద్రయ్య, శంభులింగ దక్షణామూర్తి, సర్వమ్మ, కాళమ్మ జన్మించిరి
5. దక్షిణామూర్తి బ్రహ్మచారిగా నుండెను.
1. గోవిందయ్య పుత్రుడు ఓంకారమయ్య కమలమ్మ దంపతులకు శంభులింగం ఒకే కుమారుడు జన్మించెను.
రంగరాజు చరిత్ర
నగరపాడు గ్రామ దేశముఖు జోగిరాజు సంతానము కొరకై ఎన్నో తీర్థయాత్రలు సేవించి వచ్చెను. కాని సంతానము కానందున చింతించు చుండెను.
ఒకపుడు వీరబ్రహ్మేంద్రస్వామి సంచారము చేయుచు అదే మార్గము వచ్చుచుండుట గమనించి జోగిరాజు ఎదురేగి ఇంటికి తోడుకొని వచ్చి ఆ స్వామికి పాదపూజ చేసెను. తదుపరి ఆ స్వామి
జోగిరాజా! నీ మనోభావము నాకు తెలియును, నీ జాతకములో సంతాన యోగములేదు నీకు పుత్రకాంక్ష తీరుటకై ఈ యంత్రము పూజింపుము. నీకు పుత్రుడు కలుగునని యంత్రము నిచ్చి ఆశీర్వదించి తిరిగి వెళ్లెను.
కందిమల్లయపల్లెలో వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన తదుపరి గోవిందయ్యగారి మఠాధిపతిగా పట్టాభిషేకము జేసిరి. పోతులూరయ్య, ఓంకారమయ్య, గిరిరాజయ్య ఆ ప్రాంతము సంచారము చేయుచు భక్తులిచ్చిన కానుకలు తెచ్చి స్వామివారి సజీవసమాధికి నిత్యపూజలు జరుపుచుండిరి.
నగరపాడు గ్రామములో జోగిరాజు ఆ యంత్రమును పూజించు చుండగ ఆయనకు కొన్నాళ్లకు పుత్రుడు గలిగెను. ఆ బాలునికి రంగరాజు అని నామకరణము జేసిరి. ఆ బాలుడు చిన్ననాటి నుండి తండ్రి పూజించుచున్న యంత్రమును తను కూడా పూజించుచు యుక్త వయసు వరకు ఆ యంత్ర మహిమ ప్రభావమును తెలిసికొని తండ్రిగారితో నాన్నా! ఈ యంత్రములో ఈశ్వరమ్మకు నాకు వివాహము జరుగు యోగమున్నది. నేను కందిమల్లయ్యపల్లెకు వెళ్లి మఠాధిపతితో కలిసి విచారిస్తానని తండ్రి అనుమతి పొంది కందిమల్లయ్యపల్లెకు వచ్చెను.
మఠములో గోవిందయ్య పోతులూరయ్య కొలువుతీరి కూర్చున్న వారిని జూచి నమస్కరించి అయ్యా! నేను వీరబ్రహ్మేంద్రస్వామి యంత్ర మహిమచే జన్మించినానని తన వృత్తాంతము చెప్పి ఈ యంత్రములో మీ కూతురు ఈశ్వరమ్మను గూర్చి మీతో వియ్యమొందవలెనని తెలియుచున్నది. దీనిని చూచి పరిశీలించుడని తనచేతిలో నున్న యంత్రమును గోవిందయ్య గారికిచ్చెను. అదిజూచి రంగరాజా! మా తండ్రిగారు ఇలాంటి యంత్రాలు ఎందరికో ఇచ్చినారు. దీనిలో నాకేమి అర్థము గాలేదు, మీకు మాకు చుట్టరీకము కలువనిది. నీవు ఇచటి నుండి వెళ్లిపొమ్మని గద్దించి పలుకగా అయ్యా! కోపగించకండి శ్రీవారు వ్రాసిన కాలజ్ఞాన మెపుడు కొల్లబోదు దీనిలో మీకు తెలియకుంటె తాళపత్ర గ్రంథాలలో యుండవచ్చు దానిని పరిశీలించండి యదార్థము తెలియగలదని చెప్పగా
ఆ తాళపత్ర గ్రంథాలు ఇక్కడ లేవు బనగానిపల్లెలో భూగర్భమంటపములో దాచబడినవి బయటికి తీయుటకు ఎవరికి సాధ్యము కాదు అనెను.
అయ్యా! అవి బయటికి తీయుటకు మీ వంశసంబధితులే భాద్యులు నావెంట వచ్చిన ఆ గ్రంథాలు బయటికి తీసే ఉపాయము చెప్పెదను అనెను. ఆ మాటవిన్న పోతులూరయ్య నేను వచ్చెదను అనగా! ఇద్దరు కలిసి నడిచి బనగానిపల్లెకు వచ్చిరి. రంగరాజు అచట వున్న శాసనాన్ని పరిశీలించి అయ్యా ! ఈ శాసనములో ఈ విధంగా వ్రాయబడినది. కార్తీక మాసములో వచ్చె పూర్తిగా కృత్తికా నక్షత్రము కూడిన పౌర్ణమినాడు * ఆ బండను గొడ్డలితో కొట్టినా జలము వచ్చును. ఆ జలమును ఇచటున్న ఎండిన చింత చెట్టుకు పోసిన ఆ చెట్టు చిగురించును అపుడు భూగర్భ మంటపద్వారము తెరుచుకొనునని చెప్పగా పోతులూరయ్య అదే విధముగా చేయగా ద్వారము తెరుచుకొనెను.
పోతులూరయ్య వీరబ్రహ్మేంద్రస్వామిని ధ్యానించుచు ఒక అడుగు ద్వారము లోపలికి వెళ్లి తాళపత్ర గ్రంథము తీసికొని బయటనున్న రంగరాజుకు అందించి, మరల ఒక అడుగు ముందుకువేయగా ఆ గ్రంథాలు ఒక అడుగు వెనుకకు జరిగెను. ధైర్యముతో మరొక అడుగు ముందుకు వేయగా ఆ గ్రంథాలన్ని నాగసర్పములై పడగలు విప్పి ఆడుచుండెను. ఆ విషయము రంగరాజుకు తెలుపగా! అయ్యా! వెనుదిరిగి రండి ఆ స్వామి ఆజ్ఞ అంతె యున్నదని చెప్పగా బయటికొచ్చెను. ఇద్దరు కలిసి
కందిమల్లయపల్లెకు వచ్చి గోవిందయ్యస్వామికి కివ్వగా ఆయన ఇట్లు చదివెను

