శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • కం|| అందున్న విత్తముగొని

    సందర్భమునెరిగివ్యయము - సమయమునెరిగిన్

    అందరిపై అధికారము

    జెందిన గ్రామాధికారి – జేయగబూనున్ ప్ర. నిష్ప్ర

    అని ఆస్వామి తెలియజేయగా ఆద్రవ్యముచే శేషారెడ్డి మంఠపమును పూర్తిగా కట్టించి వీరబ్రహ్మేంద్రస్వామిని తోడుకొని వెళ్లి ఆ మంఠపము చూయించెను. ఆ స్వామి సంతసించి శేషారెడ్డి! నాయందు భక్తి శ్రద్ధ వహించి మఠమును కట్టించితివి. నీకే వరము కావలయునో కోరుకొమ్మనగా!

    స్వామీ! మీ పాదదాసుడను కావలెనని నా కోరిక అనగా! ఒక సుముహూర్తమున ఆస్వామి శేషారెడ్డికి మంత్రోపదేశము చేసెను.

    ఒకనాడు ఆ స్వామి అందరిని పిలిపించుకొని నేను క్రీ॥శ॥ 1693 కలియుగము 4793 శ్రీముఖనామ సం||ర ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష దశిమి శుక్రవారము ఉత్తరానక్షత్ర మధ్యాహ్నము 12-05 పన్నెండు గంటల అయిదు నిమిషములకు కర్కాటక లగ్న శుభ పుష్కరాంశమునందు సజీవసమాధి కావలెను. కావున చైత్రశుద్ధ పాడ్యమినుండి ఏకాంత వాసమందు యుండెదను. మీ సంశయములేమైన యున్న ఎడల అడగండి అనగా!

    సిద్దయ్యలేచి గురువుగారి పాదములకు నమస్కరించి స్వామి ఇన్నాళ్లు మీ పాదసేవ జేయుచుంటిని ఇక ముందు నేనేమి చేయవలెననగా!

    కం॥ సిద్ధునిగాంచి బల్కెప్ర

    సిద్ధముగా వినుము నీవు - క్షితితలమునన్

    బుద్ధికి మెచ్చిన గృహమున

    సిద్ధా జన్మింపు మీవు – శివరామమాఖ్యన్ ప్ర.నిష్ప్ర పేజీ 345

    * ఆ స్వామి ఈ విధముగా చెప్పి తన పాదుకలు దండ కమండలములు సిద్దయ్యకు ఇచ్చి ముడుమాల గ్రామముచేరి వీటిని నీ జన్మాంతము వరకు పూజించుచు ముక్తి బొందుమని ఆశీర్వదించెను.

    * శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పాదుకలు దండ కమండలము మూడుమాల గ్రామములో నేటికి దర్శించవచ్చు.

    గోవిందమాంబ లేచి పతిపాదములకు నమస్కరించి నాథా! నన్ను మీలోనె చేర్చుకొమ్మని ప్రార్థించగా!

    ఓ సతీ! నేను సమాధి గర్తములో ఎల్లపుడు యోగనిష్ఠలోనే యుందును. నీ జీవితము వరకు ఇటులే ముత్తైదువుగా నుండి నన్ను ధ్యానించు చుండుమని చెప్పి ఆశీర్వదించెను. శేషారెడ్డి కుచ్చుబాబు సుబ్రమణ్యం ముగ్గురు లేచి స్వామివారి పాదములకు నమస్కరించి స్వామీ! మీరు యోగాలయములో ప్రవేశించు దినము పర్వదినముగా నడుచునట్టు వరము ప్రసాదించుడని ప్రార్థించగా!

    శేషారెడ్డి మానవులకెందాక నాపై భక్తి గలిగుందురో అంతవరకు అంశములు పొందు చుందురు. నన్ను నమ్మి పూజించిన వారికి పుణ్యము ప్రాప్తించునని అందరికి ఆశీర్వదించుచు తిరిగి నేను వైశాఖ శుద్ధ నవమి నాడు మీకు దర్శనమిత్తునని ఏకాంత వాసమునకు వెళ్లెను. ఆ గ్రామాధికారి శేషారెడ్డి గ్రామ ప్రజలందరిని పిలిపించి ఈ విధంగా చెప్పెను. కందిమల్లయ పురవాస ప్రజలారా! శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మన గ్రామములోనే సజీవ సమాధి కాబోవు చున్నారు అది మన గ్రామానికెంతో కీర్తి ప్రతిష్టలు గలుగును. మన గ్రామమంతా శుభ్రపరిచి పచ్చని తోరణాలతో అలంకరించి ఎవరి ఇండ్లు వారు అలంకరించు కొనవలెనని చెప్పి శ్రీముఖములు వ్రాసి చుట్టూ గ్రామాల వారికి పంపించిరి. ఆయా గ్రామ ప్రజలు శ్రీముఖము చూచుకొని చదువుకొని తండోప తండములుగా వచ్చుచుండిరి.

    వీరబ్రహ్మేంద్రస్వామి ఏకాంతవాసము ముగించికొని వైశాఖ శుక్ల పక్ష నవమినాడు బయటికి వచ్చెను. దేవబ్రాహ్మణ పురోహితులు వేదమంత్రములు చెప్పుచుండగా ఆ స్వామి భార్యపుత్రులు పౌత్రీ కుటుంబీకులందరు కలిసి వీరబ్రహ్మేంద్రస్వామిని అభిషేకించి పట్టు పితాంబరములు కట్టించి సుగంధ భస్మధారణ శ్రీగంధాది లేపనము జేసి పూలమాలలతో అలంకరించి సహస్ర నామార్చన జేసి బ్రహ్మరథముపై నెక్కించి మంగళ వాద్యములతో వేదఘోషణలతో ఘనముగా ఊరేగింపు జేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము భూగర్భమంటపము ముందు దింపిరి. ఆ స్వామి భూగర్భ మంటపములో నిలిచి అందరిని ఆశీర్వదిస్తు భక్తులారా! నేను వ్రాసిన కాలజ్ఞానము

    అక్షర పరతత్వ మెరిగి ఎవరు వీరధర్మజుల

    భజనజేతురో వారు ఆచంద్రార్కస్థాయి గాను

    సుఖాననుందురు. కాల సప్తమా పేజీ 72

    మూల మంత్రము : ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః

    అను ద్వాదశాక్షర మంత్రము నిత్యము జపించువారికి ఆయురారోగ్యములు గలిగి సుఖాననుందురు. సర్వేజనాః సుఖినోభవంతు అని దీవించి గర్తములో పద్మాసనవైచి కూర్చుండి తన ప్రాణవాయువును సహస్రారమందుంచి యోగనిష్ఠ ధ్యానుడై యుండెను. గోవిందయ్యాచార్యులు పోతులూరయ్యాచార్యులు వారిసోదరులు పై మూతబిగించి సజీవ సమాధిని పూజించిరి.