
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
శక్తిదీక్షయనగా! గురువు శిష్యుని యొక్క గురుభక్తిని తెలిసికొని తన తపోశక్తిని కొంత శిష్యునిలో ప్రవేశింపజేయును. శిష్యునకు అప్పుడు ఆత్మలో భక్తిజ్ఞానము కలుగును. ఈదీక్ష వహించినవారు జననమరణాది సర్వము తెలిసికొందురు. దీక్ష వహించినవారు జన్మాంతరము బ్రహ్మచారిగా నుండవలెను.
ఒకనాటి సాయంకాల సమయములో గురుశిష్యులిద్దరు గుహ వెలుపలికి వచ్చి విహరించుచుండగా! ఆ సమయములో అడవిలో నుండి ఒక పులి వచ్చి అచట మేయుచున్న ఆవులమందలో బడి ఆవును చంపబోగ వీరగురుడు చూచి తన చేతనున్న బెత్తముతో అదలించగా ఆ పులి పారిపోయెను. పశువుల కాపరులది చూచి భయపడి ఆవుల మందను విడిచి పెట్టి పరుగిడుచు బనగానిపల్లెకు వచ్చి అచ్చమ్మతో ఇట్లు చెప్పిరి.
ఓ తల్లీ ! అడవిలో ఆవులు మేయుచుండగా ఎచట నుండియో పులి వచ్చి మందలో దూకి ఆవును చంపబోగా విభూతి ధరించిన నొక మహనీయుడు అటు నుండి వచ్చి తన చేతనున్న బెత్తముతో అదలించగా ఆ పులి పారిపోవుచు మా వైపు వచ్చుట జూచి మమ్ములను చంపునేమోయని భయపడి పారిపోయి వచ్చితిమని చెప్పుచుండగా, ఆవులు అడవిలో మేసి తిరిగి వచ్చుచుండెను. అచ్చమ్మ చూచి వాటిని లెక్కించుచు దొడ్డిలోనికి తోలెను, అన్ని సరిగా నుండెను ఆమె సంతోసించి పశువుల కాపరులతో ఇట్లనెను.
గోపాలకులారా! రవ్వలకొండ గుహలో ఒక మహనీయడు తపస్సు చేయుచున్నాడు. ఆయననను దర్శించుటకెవరికి సాధ్యముకాదని విన్నాను. ఆ మహానీయుడే మన గోవుల రక్షించి యుండవచ్చును.* రేపు మీవెంట వచ్చెద, ఆ మహనీయుడు మీకు కనుపించిన స్థలము చూయించుడని చెప్పి మరునాడు పాలు, పండ్లు, పూలు తీసికొని పశువుల కాపరుల వెంట వెళ్లెను. నిన్నటి రోజు కనుపించిన స్థానమును చూయించగా అక్కడికి వెళ్లెను. అటు ఇటు దిరుగుచు కొండ ఎక్కి ఆ స్వామి తపస్సు చేయుచున్న గుహను చూచి గుహ ముందు నిలిచి లోపలికి దృష్ఠి నిలిపి చూడగ గుహలోపల ఆ మహనీయుడు కనుపించి కనుపించకుండెను. ఆమె ధైర్యముతో లోపలికి వెళ్లి పాలు, పండ్లు, పూలు ఆ స్వామి ముందుంచి నిట్లు ప్రార్థించెను.
* చూడుడు ప్రపంచ నిష్ప్రపంచకందార్థ సంగ్రహ పేజీ 35
* ఓ మహనీయ నన్ను రక్షించే దేవుడవని నిన్ను నమ్మి వచ్చితినని ప్రార్థించుచుండగా కొంతసేపటికా స్వామి కనులు దెరిచి చూచి అమ్మా నిన్ను రక్షింతునుగాని నీవెవరవు నరులు తిరుగని స్థానమునకు సాహసించి రావలసిన కారణమేమి నీ అభిష్ఠమేమనగా, ఓ స్వామీ! నేను ఈ గ్రామాధికారి గరివిరెడ్డి వెంకటరెడ్డిగారి భార్యను నా పేరు అచ్చమ్మ నా కన్ని భోగ భాగ్యాలున్నవి కాని నా జన్మ పావనము కొరకై మీ పాదసేవ చేయవలెననని నా కోరిక, మీరు మా గ్రామములో నివసించండి. మీ అన్ని సౌకర్యములు కల్పించుచు మీ పాద సేవ చేసికొందునని ప్రార్థించగా విని, అచ్చమ్మా ! నీ ఇష్ఠ ప్రకారమే మీ గ్రామములో నుందును గాని నేను వ్రాసిన కాలజ్ఞాన గ్రంథాలు భద్రముగా నుండుటకు నేను తపస్సు చేసికొనుటకు భూమంటపము కట్టించుము. వచ్చెదనని ఆ మంటప నమోనరేఖ వ్రాసి శంకుస్థాపన ముహూర్తము చెప్పి ఆశీర్వదించి పంపించెను.
అచ్చమ్మ తిరిగి ఇంటికి వచ్చి అచ్చట జరిగిన వివరములన్నీ భర్తతో చెప్పి ఆరు మాసములలో భూగర్భ మంటపము పూర్తిగా కట్టించి తిరిగి ఆ స్వామి దగ్గరికి వెళ్లి చెప్పెను.
* చూడుడు ప్రపంచ నిష్ప్రపంచ కందార్థ సంగ్రహ పేజీ 45
వీరబ్రహ్మేంద్రస్వామి సంతోషించి ఒక సుముహూర్తమునందు తాను వ్రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అన్నాజయ్య తీసికొనెను. గురుశిష్యులిద్దరు అచ్చమ్మ వెంట బనగానిపల్లెకు వచ్చి ఆమె కట్టించిన భూమంటపములో గురుశిష్యులిద్దరు నివసించిరి. అచ్చమ్మ ప్రతిదినము పాలు,పండ్లు తెచ్చి ఇచ్చుచుండెను. ఇతరులెవరు లోపలికి రాకుండిరి.
ఒక సుముహూర్తమున వీరబ్రహ్మేంద్రస్వామి అచ్చమ్మకు చలనములేని అచల మంత్రోపదేశము చేసెను. అచ్చమ్మ మంత్రము జపించుచుండగ ఆమెకు జ్ఞానోదయమాయెను. ఇటుల కొంతకాలము గడిచిన తదుపరి ఒకనాడు వీరబ్రహ్మేంద్రస్వామి అచ్చమ్మను పిలిచి ఇట్లు చెప్పెను.
కం|| మఠమున నిర్వదైవేడులు
హఠముగ గ్రంథములు వ్రాయ నంతయు ముగిసెన్
కఠినంపు గచ్చుబండను
ధిరముగ నేర్పరచవలెను. దేవాలయము వలెన్ ప్ర. నిష్ప్ర
అని చెప్పగా అచ్చమ్మ గురువాజ్ఞ ప్రకారము గచ్చు బండను చేయించెను. 332000 కాలజ్ఞాన గ్రంథాలు గర్తములో నుంచీ పైన గచ్చు బిగించిరి. దానిలో ఒక గ్రంథము తీసికొనెను.
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానము రవ్వలకొండలో వ్రాసిన కాలము క్రీ॥శ॥ 1625 నుండి 1650 వరకు మొత్తం 25 సంవత్సరములు. అచ్చమ్మా! కాలజ్ఞానము వ్రాయుట సంపూర్తి అయ్యినది. ఇక నేను గృహస్థాశ్రమ ధర్మము పాటించుటకు వెళ్లవలెను. మీకేమైనా సంశయములు వున్నా అడుగు అనగా! అచ్చమ్మ లేచి నిలిచి నమస్కరించి స్వామీ! తొలిజన్మలో నేనెవరినో కాని ఈ జన్మలో మీ పాద సేవజేయుచు ధన్యురాలను అయితిని ముందువచ్చే జన్మలో మీ బిడ్డగా జన్మించు వరమివ్వగలరని కోరగా * అచ్చమ్మా! నీ తొలిజన్మలోనే సక్కగారి జవ్వకక్కవు ఆనాటి నా తొలి అవతారములో నాకు సేవ చేసినందులకే ఈ జన్మలో రెడ్డిరాణిగా జన్మించినావు. ముందు జన్మలో నా ముద్దుబిడ్డవై జన్మించుమని దీవించెను. అన్నాజయ్య లేచి నమస్కరించి స్వామీ నేను మీ వెంట వస్తాను అనగా! అన్నాజయ్యా నీవు ఇచటనే వుండి కాలజ్ఞాన గ్రంథములుగల గర్తమును పూజించు చుండుము. అయిదు సంవత్సరముల తదుపరి నీ స్థూలకాయము విడిచి కలగోట్ల గ్రామములో దూదేకుల వంశములో జన్మించి నాకు శిష్యుడవగుదువని చెప్పెను.

