శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • వీరబ్రహ్మేంద్రుడు సంపూర్ణ అనుభవము కలిగి లోకకళ్యాణార్థమై భూతభవిష్యద్వర్తమాన కాల ధర్మముల తెలిసికోవాలని కోరిక కలగి తల్లిదండ్రుల అనుమతి పొంది, ఇంటినుండి బయలు దేరి మహానంది, శ్రీశైలము, కుంభఖోణము, వారణాసి(కాశి), ఆహోబిలము మొదలగు పుణ్యక్షేత్రములు దర్శించుచు అక్కడక్కడ ఆనంద గురువులను ఆశ్రయించి వారి వలన దేవరహస్యములను తెలిసికొని వారి అనుమతిపొంది బనగానిపల్లె గ్రామసమీపమున గల రవ్వలకొండ నెక్కి ఆ పర్వతమంత తిరిగిచూడగా నర సంచారములేని చోట నొక గుహ కనుపించెను. ఆ గుహలోపలికి దిగి చూడగా గుహలో విశాలమైన స్థలము, వెడల్పు అయిన బండ, ఆ బండకు ఈశాన్యమున చిన్న రంధ్రము నుండి జీవజల ఎల్లప్పుడు పారుచుండుట చూచి అచ్చట ఆశ్రమము ఏర్పరుచుకొని తపస్సు చేయుచుండెను. ప్రతి దినము ఉదయము గుహ వెలుపలికి వచ్చి సూర్య నమస్కారము చేసికొని తిరిగి గుహలోపలికి వెళ్లి తపస్సు చేయుట ప్రజలకు తెలియక ఉండెను.

    * రవ్వలకొండ లోపల వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేసిన ఆశ్రమ స్థానము నేటికి దర్శించవచ్చును.

    ఈ విధముగా వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేయుచు కాలము గడుపుచుండెను. కొంతకాలమునకు ఆ స్వామి సూర్య నమస్కారమునకై గుహవెలుపలికిరాగ పశువుల కాపరులు జూచి ప్రజలకు తెలియజేసిరి. ఆ వార్త పల్లెలు, పట్టణాలు వ్యాపించెను. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణములో కౌండ్యన్యస గోత్రజుడు ఫణిభట్టు అను వైదిక బ్రాహ్మణుడు ఉండెను. అతని ఏకైక కుమారుడు అన్నాజయ్య భక్తి సాంప్రదాయము గలవాడు. తనకు సరియైన గురువు ఎచట ఉన్నాడో అని చింతించుచుండెను. బనగానిపల్లె రవ్వలకొండ గుహలో ఒక మహర్షి ఉన్నాడని ఆయనను దర్శించుటకు ఎవరికి సాధ్యము కాదని వార్తవిన్నంతనే అన్నాజయ్యకెంతో సంతోషము కలిగి, తల్లిదండ్రుల అనుమతి తీసుకొని బయలుదేరి రవ్వలకొండ ఎక్కి తిరుగుచుండగ ఒక గుహ కనుపించెను దాని సమీపమునకు వెళ్లి గుహలోపలికి దృష్టి నిలిపి చూడగ * ఆ మహనీయుని వక్షస్థలమున పుష్పహారమువలె ఒక యహిరాజము మస్తకముపై యొక ఫణీంద్రుడు కటిక సూత్రముగా వేరొక సర్పము రెండు భుజములను రెండు ఫణులు ఇరుపార్శముల పడగలెత్తుకొని ఆడుచు సాక్షాత్తు పరమేశ్వరునివలె కనుపించెను.

    * చూడుడు ప్రపంచ నిష్ప్రపంచకందార్థ సంగ్రహపేజీ 32 అన్నజయ్య భయము చెందక, ధైర్యముతో గుహలోపలికి దిగి ముకుళిత హస్తయై ముందునిలిచి

    శ్లో॥ బ్రహ్మవిష్ణు సురాధీశ, సేవ్యపాదసరోరుహం

    పరాత్పరతరం దేవం, నీలకంఠం మహాంభజే ప్ర. నిష్ప్ర

    అని స్తుతించుచు మూడు రోజుల పాటు ధ్యానించుచు నిలుచుండెను. అపుడు వీరయోగీశ్వరుడు కనులుదెరిచి చూచి, ఓ మనుషోత్తమా! నీ ధైర్యసాహసానికి నీ భక్తికి మెచ్చితిని. నీ యభిష్ఠము నెరవేరుగాక, నీ రాకకు కారణమేమనగా! అన్నాజయ్య స్వామికి పునఃనమస్కరించి ఓ స్వామి! తమరికి పాదసేవ చేయుటకై వచ్చినాను. కాదనక అనుమతించగలరని ప్రార్థించగా, స్వామి తథాస్తు అని ఆశీర్వదించెను. ఆనాటి నుండి అన్నాజయ్య ఆ గుహలోనున్న భూమిని శుభ్రపరచుచు వసతిగా జేసి గురువాజ్ఞను పాటించుచు గురువు చెప్పిన ప్రకారము ప్రతి దినము గుహ వెలుపలికి వచ్చి తాళపత్రములను కోసికొని తెచ్చి గురువుగారి ముందుంచగా సమయోచితముగా వీర గురుడు తాళపత్రములపై ఏమో వ్రాయుచు కట్టలు గట్టి ప్రక్కకు పెట్టుచుండెను. కొంతకాలమునకు నంద్యాల నుండి ఫణిభట్టు వచ్చి గుహముందు వేచియుండి ఆ స్వామి సూర్య నమస్కారమునకై గుహ వెలుపలికి రాగా పాదనమస్కారము చేసి ఓ స్వామి నా ఏకైక పుత్రడు అన్నాయజ్య మీ సన్నిధానములోయుండి మీసేవజేయుట నాకేమి అభ్యంతరము లేదు. కాని నావంశవృద్ధికై చింతించుచున్నాననగా! ఆ స్వామి విని, ఓయీ! ఫణిభట్టూ నీవు పుత్రకాంక్షచే నిచటికి వచ్చినావు. నీ పుత్రుడు పూర్వజన్మ పుణ్యఫలము అనుసరించి ఈ జన్మలో సంసార రహితుడై నాకు ప్రథమ శిష్యుడైనాడు. ఇతనిపై ఆకాంక్ష వదులుము. ఇదిగో ఈ యంత్రమును పూజింపుము నీకు మరో కుమారుడు కలుగును. అతని వలన నీ వంశవృద్ధి అగునని యంత్రమునిచ్చి దీవించి పంపించెను. ఫణిభట్టు తిరగి నంద్యాలకు వచ్చి ఆ యంత్రమును పూజించుచుండగా కుమారుడు గలిగెను. అతని వల్ల వంశోద్ధారకుడు ఆయెను.

    ఆ॥గీ॥ ఇటులజెప్పియుమౌని – ఎప్పటివలెతాను

    వ్రాయుచుండ - విప్రవరుడుజూచి

    తాళపత్రములను – మేళనగావించి

    ఇచ్చుచుండెను నధిక – ఈప్సితముగా ప్ర. నిష్ప్ర.

    స్వామి తాళపత్రములపై ఏమి వ్రాయుచున్నాడో వివరములు దెలిసికొనవలెనను కుతూహలము గలిగి ఓకనాడు ఆ స్వామితో నిట్లుడిగెను. ఓ స్వామీ ! ఇన్నాళ్ల నుండి మీరు తాళపత్రములపై ఏమి వ్రాయుచున్నారో తెలిసికొనవలెనని కుతూహలము ఉన్నదనగా ఆ స్వామి చిరునవ్వుతో ఇట్లనెను.

    కం|| కలియుగపాదచతుష్టయ

    ములయందున జరుగునట్టి – ముఖ్యాంశంబుల్

    దెలిపెడి కాలజ్ఞానము

    సలలితముగ వ్రాయుచుంటి సత్యముశిష్యా ప్ర. నిష్ప్ర.

    అని చెప్పి శిష్యుని మనస్సు కృతార్థుని జేసి ఒక శుభముహూర్తమున అన్నాజయ్యకు మంత్రోపదేశము శక్తి దీక్షనిచ్చెను.