శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర
కక్కయ్య దేవతామూర్తుల దర్శించుట
మీ పరిపూర్ణానుగ్రహముచేత మేమీ చక్రములయందలి దేవతామూర్తులను దర్శించ గలిగితిమి. అని సంతోషాంబుధిలో తేలియాడుచు సద్గురు పాదములపై బడికక్కయ్య స్వామి! నేనీ దివ్యదర్శనమును బొందితిని. ఇక అనర్థకంబగు సంసారసాగరంబునబడి ఈదులాడజాలను. నన్ను కూడ మీ కృపాకటాక్షంబున బ్రహ్మైక్యాను సంధానుడనగునటుల జేయుమని బ్రార్థించెను.
అంతట గురుమూర్తియగు శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు ఓయీ కక్కా? నీవీ దేహంబును వదలినచో నీలోని అంతరాత్మ పరమాత్మలో విలీనంబగునే గాని నీకు నిత్యము బ్రహ్మదర్శన భాగ్యం బెటుల లభించును? కనుక నీకీక్షణముతో సంసారసాగరమున గల సమస్త దుఃఖంబులు నివృత్తి అయినవి. నీకు నేటినుండి బాహ్య శరీరంబుకూడ దివ్యశరీరమై వెలుగొందగలదు. నీవు నీధర్మపత్నియు చిరకాలము సుఖమగు భగవద్దర్శనమును ఆధ్యాత్మ వ్యాసంగముల జేసికొని తృప్తులగుచుండుడు,
కక్కయ్య భార్యను బ్రతికించుట
ఇదియే నీ భార్యయు ఇప్పుడే నిద్రలేచిన పగిది లేవగలదు సందేహపడకుమనుచు కక్కని భార్య శరీరముపై మంత్రాక్షతలు, విభూతిజలంబులు జల్లినంతనే రామపాద స్పర్శచే రాయిగామారిన గౌతముని భార్యయగు అహల్య యేవిధముగ దివ్యమంగళ విగ్రహముగ పత్యక్షమైనదో అదే విధమున ఇటునుండిఅటు పొల్లుచూ అబ్బ యెంతటి సుఖనిద్ర చెందితిని. నేటి నిద్రలో నాకు దివ్యమంగ స్వరూపులగు త్రిమూర్తులు సద్గురు దేవుని దర్శనమైనది. ఎంతటి జన్మ సాఫల్యత. ఏమి ఆనందము. అనుచు పూర్వజన్మార్జిత తపఃఫలంబీ నాడు ఫలించినదనుచుఅనంతానంద వారాంబుధినందు తేలియాడినది.
ఇంతలో అటయున్న సద్గురుమూర్తి దర్శనము ప్రత్యేక్షముగ కనిపించినది. మహాత్మా నా అంతరంగమున గనిపించిన మీరిటు ప్రత్యక్షదర్శన మిచ్చితిరే ఏమి నా అదృష్టము.
అల్పజాతివారమైన మా గృహమునకు మీరే కారణమున వచ్చితిరోగాని మా గృహమంతయు పరమపావనమైనది. మా జన్మలే తరించినవనుచు ప్రార్ధించుచుండ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారు.
కక్కయ్య భార్యను ఆశీర్వదించుట
తల్లీ ! నీ సుకృత విశేషము మిక్కిలి కొనియాడదగినది. నీవంటి పతివ్రతామణులీ లోకము నెంతయో కొలదిగ మాత్రమే యుండగలరు, నీవు మిగులగుణశాలివి. మహాసాధ్వివి. కులముతో పనియేమి. సద్గుణమే ప్రధానము. మహాపుణ్యవతి వగుటచే మరల పునర్జన్మ మీదేహముతోడనే యేర్పడినది. నీకును నీ కుటుంబమునకును సర్వమంగళములు కలుగుగాక' యనుచు ఆశీర్వదించెను.
కక్కని ఆశీర్వదించుట
కక్కనివైపు దిరిగి నాయనా? కక్కా! నీవునాకు పరమ భక్తుడవు. ఇక పిమ్మట మీ దంపతులుభయులు మా సాన్నిధ్యమున కనిపించుచుండుడు.మీకు సక లైశ్వర్యములుకూడ నేటితో సిద్దింపగలవనుచుండగనే కక్కడు భార్యతో సహా శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారికి ప్రదక్షిణ నమస్కారంబులర్పించి దేవా! ఈ శరీరంబులు మాయావజ్జీవకాలము మీపాదపద్మములయందుపరమభక్తితోనుండగల వారమనుచూ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వాములవారిని సాగనంపి వారానంద భరితులైరి.
జీవయాత్ర ముగింపు
ఈ విధముగ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి పరిపూర్ణానుగ్రహమును బొందిన కక్కని దంపతులు, సద్గురు సేవల నొనర్చుచూ తమ యావజ్జీవితము శ్రీ బ్రహ్మముగారికి దానానదాసులగుచు కృతకృత్యులై జీవితాంతమున శ్రీ స్వాములవారి మఠ సామీప్యమునందె జీవయాత్ర ముగించిరి. కక్కడుకూడ గురువుగారివలె శిష్యపరంపరను అపరిమితముగ సంపాదించినందున కక్కని భక్తవర్గము వారందరును శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మక సమీపమునందే యొక హరిజన దేవళమునిర్మించి అందు కక్కని దంపతుల కానందరూపమగు పూజాధ్యానాదుల వారి మతానుసారము జరుపుచున్న వారైరి. కాలక్రమమున నేడు ఆ కక్కని దేవళము అనంత వైభవములతో విరాజిల్లుచున్నది. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు వెళ్ళిన భక్తులందరును కక్కని దివ్యరూపము దర్శించకుండ పోజాలరు. అట్టి విశిష్టమహిమతో కక్కని ఆలయము నేటికిని నెలకొని యున్నది.

