గృహంబున గృహిణి నిద్రించుచుండుట గర్భచ్చేదనము

ఈతని మనో ధైర్యమునకు తగినట్లు పతివ్రతామ తల్లియైన ఈ కక్కని భార్య అర్ధరాత్రి సమయంబగుటచే ఒడలు తెలియని నిద్రలో నున్నది. కక్కడు ఇదియే మంచి సమయమని యెంచి పదునగు కత్తితో భార్య గర్భకోశము మొదలు కంఠము పర్యంతము కోసి జూచెను.

శరీరంబున దేవతలు కనిపించకుండుట

దైవదర్శనావేశంబున ఇట్లు జేసిన కక్కనికి భార్య దేహంబున మాంసకృత్తులేగాని దేవతామూర్తు లెచ్చటను కానరాలేదు.

కక్కని దుఃఖావేషము

ఏమి చిత్రము ? సద్గురూపదేశ నిశ్చయ మనస్కుడనై, దేహభాగంబున షట్చక్ర దర్శనమును అందుండు దేవతలను దర్శింప నెంచిన నాకు రక్తసిక్తమైన మాంసఖండంబులు తప్ప దేవతలే కనిపించకుండిరి. ఇదియేమి అన్యాయము. నాకీ దుర్బుద్ధి ఎందులకు జనించినది. అపర దేవతవలెయున్న నా యిల్లాలును నేడు నేను నాచేతుల మీదనే చంపుకొనిన వాడనైతినే. భార్యామరణము స్త్రీహత్యా పాతకము నన్ను వెన్నంటి నా జీవితమంతయు అధః పతనంబగు సమయమాసన్నమైన నేనీ నీచకార్యము దలపెట్టితినని బహువిధముల దుఃఖించుచూ, కొంతమేరకు కృతనిశ్చయుడై పరుగుపరుగున శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి సన్నిధికి ఏతెంచెను.

కక్కని హృదయమున శాస్త్రధిక్కారము

తాను శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి గృహమువద్దకు వచ్చువరకును అచట లోపల మరల మరల నీ అద్వైత చర్చ జరుగుచునే యున్నది. కాని మరల వినిననూ అదే ఉపదేశము వినిపించుచుండుటచే కక్కని హృదయమునుండి మహాప్రళయమారుత క్షుభిత పుష్కలావర్తక వృష్టిభంగి దుఃఖాశ్రువులు రాలుచున్నవి. ఆవేశపూరితమైన అతని హృదయమునుండి రకరకములగు ప్రశ్న పరంపరలు వచ్చుచున్నవి. నే నెవరిని? నన్ను ఎవరు పిలిచిరి ? నా స్వకార్యమును నేను నిర్వర్తించక ఇట్టి పనికిమాలిన పనికి యెందుకు పూనుకుంటిని? గురువులా ? గురువులు ? దొంగ గురువులు, బూటకపు గురువులు, దేశద్రోహులు, ఏ పాప మెరుగని ప్రజలను లోబరచుకొని, ధనద్రవ్యాపేక్షకై మేము జగద్గురువులమనుచు, ద్రవ్యంబుల నార్జించుచూ, బ్రహ్మము నెరుంగుదుమనుచు, బ్రహ్మవిద్యకు మించినవిద్య లేదనుచు, బ్రహ్మవిద్య పేరిట,పొట్టచేతపట్టుకొనిఇంటింటికి భిక్షాటనంబునకు బోయి ద్రవ్యములనపహరించు ఈ బూటకపు గురువులు నెంత మాత్రము నమ్మరాదు.

నా ప్రాణములో ప్రాణమై బంగరు బొమ్మవలె సకల సౌందర్య శోభితురాలై, కంటికి రెప్పవలె అన్ని గృహ కృత్యములలోనూ నా వెన్నుముకవలె యెప్పియున్న ధర్మపత్నిని నేడు యీ బూటక నాటకం వేషధారియైన బ్రహ్మము మాటను నమ్మి భార్యను వమ్ముచేసి కొంటిని. నేనిపు డీతని యెదుటబడి యేమని యడుగుదును? నే నెవడనో వారికి తెలియదు కదా? నీ భార్యనెవరు చంపమనిరయ్యా? అని అడిగినచో ఏమి సమాధానము చెప్పగలను? అని వితర్కించుకొనెను.

కక్కయ్య బ్రహ్మముగారి వద్దకుపోవుట

ఎట్టకేలకు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారి గృహ ప్రాంగణము నుండి పోతులూరూ? గురుదేవా? అనుచు పెద్దగ కేక వేసెను. ఆధ్యాత్మ చింతనలో యుండినవాడైననూ లోనివారలకు, వారికీ. కేక వినబడకి పోలేదు. ఈ కేక ఆర్తనాదముతో కూడియున్న దగుటచే, వినుచునే బ్రహ్మముగారు చటుక్కున లేచి నిలబడి ముఖ ద్వారము కడకేతెంచిరి. ఆర్తత్రాణ పరాయణుల లక్షణమిట్టిదియే కదా ? మున్నొకచో మకరేంద్రునిచే పీడింపబడిన గజేంద్రుని ఆర్తినివిని శ్రీ మన్నారాయణుండిటులనే గదా గజేంద్రుని కడకు వేంచేసి రక్షించినాడు.

ధ్యానాసక్తులైన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారికికక్కనికేక హృదయాంతరాళమును కదలించినది. కరుణారసమునిండి కావేరీ ప్రవాహమువలె పొర్లినది. ఒరులు విన్నవించకుండగనే ఏదో మహదాపద ఆసన్న మైనటుల తెలిసినది. ఇటుజూడ ఈ కడజాతివానికీ అర్ధరాత్రమున గల్గిన ఆపదఎట్టిది? ఎందులకింతటి కేకయని హృదయ మాందోళితమైనది ? అంతర్దృష్టిం జూచిరి.

కడజాతియా ? ఏది కడజాతి? ఏది మొదటిజాతి ? ఈజాతి విభేదము లెట్లు కలిగినవను వితర్కము కూడ హృదయ మున గోచరించక పోలేదు.

శంకరభగవత్పాదులు

పూర్వమొకప్పుడు శ్రీశంకర భగవత్పాదులు కాశీ మహాక్షేత్రములో ప్రాతః కాలమున గంగాస్నాన జపానుష్ఠా నాదులు నిర్వర్తించుకొని మధ్యాహ్న సమయమున శ్రీవిశ్వనాథుని దర్శించు నిమిత్తము భగవదాలయమునకు వచ్చుచున్న తరి శంకరుని శిష్యులు ముందు నడచుచుండిరి. మధ్యలో కొంత దూరము వచ్చి పిదప త్రోవ మధ్యనుండి ఒక మాదిగవాడు శ్రీ శంకరునకు ఎదురై నాడు. ఆ గొంది చాలా చిన్నదగు గొందియగుటచేత శంకరుని శిష్యులు మాదిగవానితో ఓయీ! శ్రీ శంకరులిటు వచ్చుచున్నారు. నీవు త్రోవలో అడ్డము రారాదు. వెనుకకు తొలుగుమని యనినారు.

  • eshwari devi mattam
    kalagnani qr code