శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర


సాహస్రారము

విశుద్ధ చక్రంబునకు పైన బ్రహ్మరంధ్రమందు ఉండును. ఆ సహస్రారమందు తేజోమయ రూపమైన సహస్ర దళములతో గూడుకొని 'ఓమ్' అను ప్రణవము వర్ణకంబయి దేదీప్యమానముగ బుద్ధికి నిలయంబై మాయచేత గప్పంబడి సమస్త జగత్తునకు గారణమై యథార్థముగా విచారించిన సృష్టిలేనిదయి సచ్చిదానంద స్వరూపముగలదై యున్నది.

దీనికి అధిష్టాన దేవత శ్రీ గురుమూర్తి. ఓంకార లింగం, జ్యోతిర్మయస్థానం సర్వాకర్ష, ప్రణవస్థానం, విమలజ్ఞానముద్ర 2 ఘ.46 వి. ఘ.లలో 1000 పరమహంస జపము జరుగును. ఈ ఏడు చక్రంబులు దెలిసి కొనిన సాక్షి తానైయున్నది. ఈ చక్రంబుల యందు దిరుగు వాయువు "ప్రాణం" బని చెప్పంబడును. ఈ వాయువు స్థాన భేదముచేత పది విధంబులై బ్రకాశింపుచున్నది అవి యెవ్వియనిన:- ప్రాణవాయువు, అపాన వాయువు, వ్యాసవాయువు, ఉదానవాయువు, సమాసవాయువు లను నైదు ప్రాణవాయువులున్ను, నాగవాయువు, కూర్మవాయువు, కృకురవాయువు, దేవదత్తవాయువు, ధనంజయ వాయువులును నుపవాయువు లైదును గలసి పదివాయువులు. గాంధారి మొదలై ననాడులు పదివాయువులందున దిరుగు చుండును. ప్రాణవాయుపు కుడిఎడమలందును ఇడాపింగళులను నాడులందు దిరుగుచు క్రిందికి మీదికి నడచుచుండును. ఇడా పింగళు లాధారము మొద లాజ్ఞా చక్రము వరకుండును. మధ్యనున్న సుషుమ్న నాడి యాజ్ఞను బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపించి రహస్యమైనదై దేహ మధ్యమందు ప్రధానమై యుండును. ఈ నాడులందు దిరుగుచున్న జీవుడు ప్రాణవాయువువలన నాజ్ఞా చక్రమందు బుట్టిన 'న' కార మున్నూ మూలాధారమందు అపానవాయువు వలన బట్టిన 'హ' కారమున్నూ కలిపి 'హంస' యనియు, ‘సోహం' అనియునూర్థ్వసుధాకుండలులందు వ్యాపించుచున్న ఆత్మమంత్రము నాధారాది షట్చక్రముల కధిష్టాన దేవతలైన గణపతి, బ్రహ్మ విష్ణు, రుద్రుడు, జీవుడుఈశ్వరుడు వీనిని గూర్చి ఈఉదయము మొదలు మరునాటి ఉదయము వరకు జపము జేసి యర్పణ జేయుచున్నాడు. అందు గణపతికి 600 లున్ను, బ్రహ్మకు 6000లున్ను, విష్ణువునకు 6000లున్ను, జీవునకు 1000న్నీ, ఈశ్వరునకు 1000న్నీ, సగుణముగ భగవదర్పణ చేయుచున్నాడు.సహస్రారమందు తేజోమయ రూపమైన 1000 హంసలను శ్రీ గురు పరమాత్మ కర్పణ చేయుచున్నాడు. ఇట్లు సగుణ, నిర్గుణ రూపములైన హంసలు 21600. ఈ రహస్యమును జీవుడు కనుగొన లేక శ్రీగురుసేవ చేయక కాశీ, గయ, ప్రయాగ మొదలైన తీర్థయాత్రలుకు బోవప్రయత్నించి సారూప్యాది ముక్తులను గోరుచు వాని విస్త్రతమై కాలమంతయు వ్యర్థముగ గడుపుచుండును. ఇందువలన దేహి ఆడుచున్న బంతివలెనే క్రిందికివిూదికి దిరుగుచూ సుఖదుఃఖంబులకులోనై పుట్టుచు చచ్చుచు నుండును. ఆ సహస్రారమే శబ్దరూపమైన వాక్కు. అదే పరంజ్యోతి, అదే యూర్థ్వకుండలి. అదే అమృతమునకు స్థానము. అదే సంయుక్తసృష్టికి కారణము. అది మెఱుపు వలెనే కొంచెము కాలములో గనుపడి అప్పటి కప్పుడే కప్పబడును. ఆసహస్రారమందే అవ్యక్తాది సమస్త సృష్టియున్నది. దానియందు 'తానకు' అనగా సమస్తమును చిద్విలాసమైయుండును. అప్పడీ జీవునకు ఏ దోషంబును అంటదు. ఇట్టి మార్గము దెలియలేక అధోకుండలియందుబడి దారా పుత్రాదులు తన్ను రక్షించెదరని వలలో బడిన పిట్టవలెనే ఈ దేహ మందున్న అమృతపానమును జేయలేక ఈ దేహమే నే ననుకొని కొట్టుకొనుచుండును, దీనిలో జీవుడు తనకంటే వేరైన వస్తువు కలదని తన నేర్పుకొలది కర్మభక్తులను జేయుచు కర్మకాండలో మునిగియుండును. అంటుకుండను గంగలోముంచిననూ ఎట్లు పవిత్రంబుగాదో యటువలెనే యీ దేహమును ఎన్నిసార్లు గంగలో ముంచిననూ, బాహ్యదృష్టిచే ఎన్నికర్మలు చేసినము మోక్షమురాదు. కనుక ఆధ్యాత్మిక దృష్టితో అంతర్గత జీవాత్మను దర్శించుటయే మోక్ష మార్గము.

కక్కయ్య దైవమును ప్రత్యక్షముగ జూడగోరుట

జన్మ జన్మాంతరంబులయం దెన్నియో సుకృత విశేషంబున జేసియున్నగాని దొరుకడు సద్గురువు. అట్టి సగ్గురుని సంపూర్ణ ఆధ్యాత్మిక ఉపదేశమును గోడకు చెవియొగ్గి వినిన కక్కయ్య అదృష్టము నేమనవలయును.

తన ఇంటిలో తల్లిదండ్రులకు జేసిన సేవాధర్మము తప్ప ఇతర ధర్మము లేవియు ఎరుగని కక్కయ్యకు ఈనాడు ఇంతటి దివ్యమగు ఆధ్యాత్మిక బోధ ఎన్ని జన్మముల సుకృత వి శేషమై యుండవలయును? మహామౌనులకు కూడా అందనివిషయమీతనికి అందినది. మహర్షులు ఈ ఆధ్యాత్మిక విషయ ములనెన్నియో పర్యాయములు వినుచు, అభ్యసించుచూ కూడ నిశ్చయ బుద్ధికి రాజాలరు. అదియే వారి ప్రారబ్ధము.

కక్కని కటులగాక? ఏక మాత్రోపదేశ శ్రవణ మాత్రమే పూర్ణమగు మనోనిశ్చయము దైవమునందు కలిగినది . ఇదియే మూఢభక్తి లక్షణము. నాకీనాడే భగవద్దర్శనము కాగలదు. నేనిపుడే ఇంటికి జని, నాభార్య దేహమును కోసి చక్రములు, దేవతలు, ఎచ్చటెచ్చట యేవిధముగ నుండిరో ప్రత్యక్షముగ జూతునను కొనుచు గృహమునకు వెడలెను.

  • eshwari devi mattam
    kalagnani qr code