శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర
చిదానంద మయమైనట్టియు సర్వవశ్యమును చేకొనునట్టియు, బ్రహ్మత్మానుభవరూపమైన ఈ భక్తి భావమంతయు వినుము. నేను జూపించబోవు నది నిర్మల మనస్సుచే బరికింపుము. లోకమునందు సూర్యుని కిరణములు మేధ్యా మేధ్య వస్తువుల నెన్నిటిని దగిలిననూ ఆకిరణములకు గల పవిత్రత సూర్యునికిగల ప్రకాశమునకు ఏవిధముగా అంటక దివ్యత్వము చేతనే వెలుగొందు చుండునో అదే విధముగ ఘటజలములందు ప్రతిబింబించిన సూర్య కిరణంబులు ఘటజలమునందుండు రంధ్రంబులు,జలమునందుండు కల్మషములనెటులనంటవో తద్విధంబుననే - పరమాత్మకు స్థూల దేహంబునగల దుర్గంధాదుల సూక్ష్మదేహంబున జనించు కామ క్రోధాదులును కారణ దేహంబున గల అజ్ఞానము కూడ పరమాత్మకు అంటవు.
సద్గురు సేవజేసి శాస్త్రరహస్యంబులు విచారించువారికి సూక్ష్మదృష్టిచేత (దీనినే జ్ఞానదృష్టియందురు) ఈ దేహమునందే పరమాత్మ దర్శనము తత్య్రమమును దెలిపెద వినుము.
షట్ చక్ర నిరూపణము
మూలాధారము
గురుస్థానమునందు నాలుగు రేకులు గల్గి పచ్చ నయిన వర్ణముగలదై వ, శ, ష, స అను నాలుగు దళములతో గూడుకొని ‘న' కారంబు గలదై పృథ్వినిలయంబై ఘ్రాణ కారణంబై భూమివలెనే నాలుగు కోణంబులు గలిగియుండును. ఆచారలింగము యిచ్ఛాశక్తితో నుండును. 1 ఘ, 40 వి.ఘ. కాలములలో 600 పరమ హంస జపము జరుగును. ఈ చక్రమునకు వినాయకుడు అధినేత.
స్వాదిష్ఠాన చక్రము
ఆధార చక్రంబునకు రెండు అంగుళములపైన నాఱు రేకులుగలదై మూడు కోణంబులు గల్గి 'మ' కారంబుతో గూడుకొని తెల్లని రంగుతో జలస్థానంబై జిహ్వాకారం బై బ, భ, మ, య, ర, ల యను దళంబులు గలదై పక్షి యాకృతి గానుండును. గురులింగ క్రియాశక్తి. ఈ చక్రమున బ్రహ్మదేవునకు 16 ఘ. 40 వి. ఘ. కాలములో 6000లు పరమహంసలజపము జరుగును.
మణిపూరక చక్రము
స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడు అంగుళముల మీద నాభియందు నాడులను చుట్టుకొని మణికాంతివలె బ్రకాశించుచు నీలవర్ణముగలదై 'శి' కారయుతమై త, డ. ణ, త థ, ద, ధ, న, ప, ఫ యను పదిదళంబులు గలదై తేజోని వాసంబై నేత్ర కారణంబై పీఠికాకృతిగలిగి యుండును. దీనికి విష్ణువు అధిష్టాన దేవత. శివలింగం జ్ఞానశక్తి అగ్ని ముద్ర,నాగోర్భవస్థానము 16 ఘ. 40 వి.ఘ. 6000 పరమహంసలు జపముజరుగును.
అనాహత చక్రము
మణిపూరక చక్రంబునకు పది యంగుళముల పైన హృదయ స్థానమందు పండ్రెండు దళంబులు గలిగి సువర్ణ చ్ఛాయతో, 'వ' కారముగలదై సమస్తవాక్యంబులకు స్థానమైక, ఖ, గ, ఘ, ఙ,చ, ఛ, జ, ఝ, ఞ ట, ఠ,యను దళములు గలదై వాయువునకు స్థానమై త్వగింద్రియకారణంబై లింగాకృతిగలిగి యుండును. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత. చదరంగము బీజశక్తి వాయు ముద్ర నాదప్రకాశనీ స్థానం 16 ఘ.40 వి. ఘ లలో 6000 పరమహంస జపము జరుగును.
విశుద్ధ చక్రము
అనాహత చక్రమునకు పన్నెండు అంగుళముల పైనతెల్లని కాంతి గలదై అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ,ఇ, బా, ఎ, ఐ, ఓ, ఔ, అం, అః, యను పదియారు దళంబులుగలదై చేపవంటి యాకృతిగల గగనసదనంబై శ్రోత్ర స్థానంబై కంఠస్థానమందుండును. దీనికి జీవుడు అధిష్ఠాన దేవత. సరస్వతిస్థానం. ప్రసాదలింగం, ఆదిశక్తి, ఆకాశముద్ర, జ్యోతివర్ణము. 2 ఘ. 48 వి. ఘ. 1000 జపము జరుగును.
ఆజ్ఞా చక్రము
విశుద్ధ చక్రంబు మొదలు పన్నెండు అంగుళముల పైన భ్రూమధ్యస్థానమందు. 'హంక్షం' అను రెండు దళంబులు గలదై అంతఃకరణ భవనంబై అగ్నివలె ప్రకాశించుచుండును . దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత. సర్వసృష్టిస్థానము మహా లింగం పఠాశక్తి సువర్ణవర్ణం ఆకాశముద్ర 2 ఘ. 46 వి. ఘ.లలో 1000 పరమహంసల జపము జరుగును,

