శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర
సిద్దనికి బ్రహ్మముగారు అద్వైత విచారణను వివరించుట
నేటి దనుక తను చేయు పరీక్షల కోర్చి ఓపికతో భూదేవివలె సమస్త విషయములను క్షమ క్రమమున ఎంతటికష్టమునైననూ లెక్కచేయక పెరవారి మాటలను చెవిని బెట్టక గురువాక్యమునే భగవద్వాక్యముగను, తనజన్మకు తారకముగను భావించుచూ, నేర్పుతో ఆచరణలో పెట్టగలిగిన సిద్ధనికి నేనింతవరకు బోధ చేయకుంటిని నన్నే భగవంతునిగ నెంచిన ఈ శిష్యుని కడ తేర్చుట ఎట్లు ? అని ప్రశ్నించుకొని తానంతట తానుగా ఒకానొక రాత్రి కాలమున వాకిట కావలి వానివలెయున్న సిద్ధయ్యను లోనికి పిలిచి ఒక దివ్యాసనమున తాను సుఖాసీనుడై శిష్యుని ప్రత్యుజ్ఞ్ముఖముగ కూర్చుండ బెట్టుకొని ఓయీ సిద్దా? బ్రహ్మమును జూచెదవా! అని అడిగెను.
సిద్దని ప్రత్యుత్తరము
మహానుభావా గురూత్తమా ! నన్ను పరీక్షించు చుంటిరా? ఎంతవింత? ప్రత్యక్షముగ బ్రహ్మముగారగు మీరు నిజమైన బ్రహ్మమైయుండ నేనిక ఎచట ఏ బ్రహ్మమును జూతును, నాకింకొక బ్రహ్మ మెక్కడ జూడనున్నాడు. మీ పాదమే నాకు పరబ్రహ్మమని యనగానే, ఇతని శిష్యత్వస్ఫూర్తికి ఆనందపడినవాడై శాస్త్రక్రమమున షట్చక్రరూపణ ముపదేశింప నారంభించెను.
కక్కడు బ్రహ్మముగారి ఉపదేశమును వినుట
పితృసేవా పరాయణుడైన కక్కడు పగలంతయు గృహకృత్య నివర్తనమునకు గావలసిన ద్రవ్యసంపాదనకు గ్రామపెద్దలగు రైతులవద్ద కష్టించి కుటుంబ పోషణము చేయుచు, రాత్రి కాలమున గ్రామరక్షణ ఉద్యోగమును సంపాదించిన వాడై అర్ధరాత్రివేళ దొంగల గొడవలు జరుగకుండ వీథులన్నింటిని తిరుగుచుండును.
నాటి రాత్రియందు కూడ నదేవిధముగ గ్రామ మొగినయున్న శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారి యింటి సమీపమునకు వచ్చుచుండ లోపల సందడిగ నుండుట కనిపెట్టెను. ఇటనేమి జరుగుచున్నదో? లోపల గుసగుస లేమైయుండును? దొంగ లెవరైన ప్రవేశించి నారేమో యనుకొని, నిశ్శబ్దముగ మెల్లమెల్లన గోడవద్దగల చిన్న *"సొరగూటి” వద్ద చేరి గోడకు చెవినాన్చి శబ్దమును వినసాగెను.
[*.. సొరగూడు : స్వర్ణకంత (గోడకు ఉండునట్టి చిన్నరంధ్రము)]
ఇంటిలోని బోధనలను ఆలకించుట
సిద్దయ్య : గురుదేవులకు సమస్కారములు.
బ్రహ్మం : దీర్ఘాయుష్మాన్ భవ.
సిద్ధయ్య : దేవా ! తమకు నేటికి నాయందు అనుగ్రహముకలిగినది.
బ్రహ్మం : బిడ్డా ! నీ పూర్వజన్మ కర్మఫలం నేటితో పాప శేషం నిర్మిశేషమై, సుకృత ఫలం నిండుగ పండిన దోయి.
సిద్ధయ్య : ఇది ఇట్లగుటకు మీ కరుణాకటాక్షమే కారణముకాదా?
బ్రహ్మం : నీ మనోభావము నెవరు కాదనగలరు ?
సిద్ధయ్య : గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః ! గురుస్సాక్షత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః||
ఇదియేకదా ? సకలవేద సారము. ఇంతకంటెను ఘనమైన మంత్రరాజమింకొండు కలదా స్వామీ?
బ్రహ్మం : చిరకాలము నుండి గురుసేవ జేసినందులకు తగిన సత్సాంప్రదాయ మహదర్థము నెరింగితివి. ఇక తెలియవలసినది ఇంచుక మాత్రమే కలదు. దానిని ఇపుడు ఉపదేశించెదను. సావధానముగ వినుము.
సిద్ధయ్య : ఈ ఉపదేశము నేమనియెదరు గురుదేవా ?
బ్రహ్మం : షట్చక్ర నిరూపణమందురు.
సిద్ధయ్య : కృతార్థుడను - ఈచక్రనిరూపణ నాధ్యాత్మికదృష్టితో తెలియవలెనని ఎంతకాలము నుండియో ఉవ్విళ్ళూరు చుంటిని.
బ్రహ్మం : నీకోర్కె క్షణకాలములో నెరవేరును. వినుము.
దీనిని మూలాధారమందురు. మనుష్యుని (దేహి)శరీరము పంచవింశతి తత్వంబులచేతను, దశ నాడులచేతను కప్పబడినదై నేడు కమలములతో కూడియున్నది.

