శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర
బ్రాహ్మణుని ఆశ్చర్యము
ఇదియేమి వింత ? నన్నీతనివద్దకా పతివ్రతామహా తల్లి పంపినటుల యీతని కెటులు తెలిసినది. ఎంత ఆశ్చర్యము యోగవృత్తినుండి పరిపరివిధముల తపోనియములు బాటించు చున్ననూ నాకీ ధర్మసూక్ష్మ మెంతమాత్రమును తెలియకుండెనే యని విచారించుచుండగా
ధర్మ వ్యాధుని ఉపదేశము
మహానుభావా! చింతింపవలదు. మానవుడెన్ని జన్మములాచరించినను, ఎంత కాలము తపస్సు జేసిననూ ప్రత్యక్ష దైవముల బూజింపనిదే పరోక్ష దైవతముల అనుగ్రహము కలుగజాలదు. స్త్రీకి పతియే ప్రత్యక్షదైవము. ఆ కారణమున ఆమె తన భర్తృసేవ బూర్తి గావించుకొని నీకు భిక్షనిడరాగానీవు కుపితుడవైతివి. నీ యజ్ఞానమును బారదోలు నిమిత్తమా గృహిణి నిన్ను నాకడకు బంపినది. యేజాతి మానవునకైననూ దైవములు మాతాపితరులు. వేదములు మొదలుగా సర్వశాస్త్ర ధర్మములు మాతాపితరులకంటెను మిన్ననైన దేవతలు వేరేలేరని ప్రవచించుటమీరెగుగని ధర్మము కాదు. అట్లయ్యునునీవు నీ తల్లిదండ్రుల వృద్ధుల వడలి తపోనిష్ఠయను కారణములో అడవులకు వచ్చితివి. అంతఃశ్శుద్ధి, బహిశ్శుద్ధి తెలియవలెనన్న ప్రత్యక్ష దైవతములు గురువులునైన తల్లిదండ్రుల మూలమునని తెలిసికొనవలయును కాన నో భూసురేశ్వరా? నేను కడవాడనని యెంచక నా మాటలు మనోవీథిని దిట్టబరచి, నీవు గృహమునకేగి నీ తల్లిదండ్రులు సేవానిరతుడవుకమ్ము. కన్నియు మంగళములే కాగలవని పంపెను.
కక్కయ్య - ధర్మవ్యాధుని మహిమ
చూచితిరా! ధర్మవ్యాధునిమహిమ. అదేవిధముగ ఇచట నీ కక్కయ్య కూడా ప్రతినిత్యము ధర్మవ్యాధునివలె ప్రత్యక్షదైవములైన మాతాపితృసేవతో పునీతుడైనాడు. అంతశ్శుద్ధి కలిగినది, అంతరాత్మ పరిమళసహిత మహాపుష్ప రాజమువలె సౌగంధము నీనుచున్నది. తన కింకేమి కావలయును. కావలసినది యోగసిద్ధి. ఇది ఎట్లు లభించునాయని ఆలోచనామగ్నుడై యుండెను.
సిద్దయ్య
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మముగారితో కొందరు శిష్యులు, పనివారు ఉంటూనే యున్నారు. పగటి వేళ దైవిక, దైనిక కృత్యములను నెరవేరుస్తూ, రాత్రికాలమున ముఖ్యమైన బోధనాక్రమమును క్రమము తప్పకుండా ఉపదేశించే పద్ధతిని చేపట్టినారు. తాను అన్ని విద్యలలోను పూర్ణుడే కనుక, ఇతిహాస పురాణాలుకూడా వినేవారికి శ్రోత్రపేయంగా కథలు చెప్పేవారు. ప్రముఖ శిష్యులకు వేదాంత విషయాలు నిగూఢమైన రహస్యాలు ఎవరికి ఏవిధముగ ఉపదేశించవలెనో ఎరిగి వారికి ఎరుకను తెలిపి ఆనందపరచి, తాను ఆనందించేవాడు. ముడమాల గ్రామస్థుడగు సిద్దప్ప అనువాడు మహమ్మదీయ మతస్థుడు. అతడు కుటుంబపోషణ నిమిత్తం బ్రహ్మముగారి శిల్పకళాకార్యమైన రాళ్లు చెక్కునట్టి పనిలో ప్రప్రథమంగా శ్రీ బ్రహ్మంగారి వద్ద ప్రవేశించినాడు. నిత్యకృత్యం జీతభత్యాలు సక్రమంగా నడుస్తున్నవి. సుఖజీవనం జరుగుచున్నది.
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారికి పనులు చేస్తూ చేయిస్తూ కూడా ఇతిహాస పురాణములు కథలను చెపుతూ సంతోషకరమైన మాటలతో పనివారిని ప్రోత్సహించటం అలవాటు. తురుష్కుడైనా శ్రీబ్రహ్మంగారు చేస్తున్న బోధలు ఈ సిద్దప్పకు వింటున్నకొద్ది అమృత ప్రాయములై తానుకూడా ఎంతో దైవసాన్నిధ్యాన్ని పొందినంత ఆత్మవిశ్వాసం కలుగుతూ ఉండేది.
ఒక రోజా ? ఒక నెలా ? ప్రతినిత్యము శ్రవణము కారణముగ అతని మనస్సు ఇస్లాంమతంలో నుండి హిందూ మతంలోకి పూర్తిగా ఆర్షింపబడినది. ఇంటి కుటుంబమువారికి తాను విన్న కథలను పొందుగా వినిపిస్తూ ఉండేవాడు.కాలక్రమంగా సిద్దుడు బ్రహ్మంగారిని మహాత్మా నాకు గురూప దేశం చేసి నన్ను పునీతున్ని కావించుఅనికొన్నాళ్లుగా ప్రాధేయ పడటం ఆరంభించాడు.
అంత మాత్రంచేతనే శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు సిద్దనికి వెంటనే ఉపదేశాలు ఇవ్వలా? ఇదిగో అదిగో అని కొన్ని సంవత్సారాలు గడుపుతూ వచ్చాడు. రోజులు గడచిన కొద్దీ సిద్దడి భక్తి విశ్వాసాలు ఎక్కువ గాజొచ్చినవి. ఇక కాలం గడిపితే నిజమైన భక్తి కలిగిన ఈ సిద్ధడు తనకు దక్కే పరిస్థితి కూడా కనిపించలా! అంతటి వరకు ఉగ్గబట్టిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారికి సిద్ధన్ని సిద్ధుడుగా చేసి దక్కించుకోవలెననే స్థిర నిశ్చయం కలిగినది.

