శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర
కొక్కెర చచ్చుట
ఒకనాడు కౌశికుడు తను తపోనిష్ఠనుండి లేచు సమయములో అచటి వృక్షము చివరిశాఖ యందున్న కొక్కెర ఆతడు చూచుచుండగ గిలగిల తన్నుకొనుచు క్రిందపడినది. అపుడాతడు నా తపోదృష్టికే ఈ కొక్కెర చచ్చినదని భావించుచూ మధ్యాహ్న కాలమైనందున భిక్షకై గ్రామములోనికేతెంచెను.
కౌశికుడు బ్రాహ్మణిచే పరిహసింపబడుట
పిమ్మట ఒక విప్రగృహ ప్రాంగణమున కేతెంచి బిగ్గరగా “భవతి ! భిక్షాం దేహి ! అని అరచెను. ఆగృహస్థురాలు అపుడే తన భర్త ఎచటకో వెళ్ళి అలసివచ్చిన వాడగుటచే అతని స్నానపానాదులు నిర్వర్తించి. భోజనంబిడి, కాలువత్తుచుండెను. ఆ సమయమున ఈ కౌశికుడు భిక్షయాచించుట నాలకించియు పతికి నిద్రాభంగమగునను భయముతో క్షణకాలమాగి పిదప భిక్షను తీసుకొని రాగా కౌశికుడు “ఓసీ! మేము మౌనులమని యెఱుంగవా ? భిక్షకై నీవాకిట ఎంత దనుక నిలువవలయును. నీకింతమాత్రము పరిజ్ఞానమే లేదా?” అని అనుట విని"ఓయీ బ్రాహ్మణా? నేను నీకుభిక్షమిడుటను తెలియని దానను కాను. నా భర్త అలసివచ్చిన కారణముననిద్రాభంగము కలుగకుండ క్షణకాలమాలస్యమైనంత మాత్రమున నీ క్రోధాగ్నికి గురియగుటకు నేనేమి పిచ్చి కొక్కెర ననుకొంటివా!” యనెను.
బ్రాహ్మణుడు పతివ్రతను ప్రార్థించుట
ఆ వాక్యములతో కౌశికుడు తనకుగల తపోమహిమ ఎంతపాటిదో తెలిసికొనినవాడై "తల్లీ ! నీ కింతటి పాతివ్రత్యమహిమ కలదాన వనుకొనలేదు. కనుక నన్ను మన్నించి నాకు మహిమోపేతమగు సన్మార్గ మెట్లు కుదురునోసెలవివ్వమని కోరెను.
బ్రాహ్మణి ఉపదేశము
ఓయీ కౌశికా ? నీవు జేసిన తపఃఫలం బెంతటిదో నీ వెరుంగ జాలవు. ఈ సమీపమునగల మిథిలాపట్టణమున “ధర్మవ్యాధు”డను నాతడొకడు కలడు. అతనివద్దకు వెళ్ళి నాకు జన్మసాఫల్యమగు మార్గముపదేశింపుమని యడుగుమని చెప్పిఆమె లోనికి వెడలెను.
కౌశికుడు ధర్మవ్యాధుని వద్దకు వెడలుట
పిమ్మట కౌశికుడు అత్యాశ్చర్యముతో మిథిలా పట్టణమునకు జని ధర్మవ్యాధు డుండునది ఎచటయని పాంథూనొకని యడిగెను. అతడితనితో ఆర్యా! మీకాతనితో యేమి పని? అతడీ కసాయి బజారులో మొదటనే యుండునని నుడివెను.పాంథునికి జవాబివ్వకుండగనే మెల్లగ అతడుండు చోటుకు వెడలగా ధర్మవ్యాధుడచట మాంస ఖండములను అమ్ముచుండెను.
అదిచూచి దిగ్భ్రాంతి చెందిన కౌశికుడు నన్నీకసాయివాని వద్దకు బంపినదేమి? అని లోలోన ఆశ్చర్యపడుచువిషయమునుతెలిసికొనగోరిన వాడగుటచే అటుసమీపమున నిలువబడి యుండెను.
ధర్మవ్యాధుడు బ్రాహ్మణుని గౌరవించుట
కౌశికుడు వచ్చిన విధమును తెలిసికొనిన ధర్మవ్యాధుడు వెంటనే తన విక్రయమును చాలించి కాలు జేతులు కడుగుకొని బ్రాహ్మణుని సమీపించి మహానుభావా తామెచటినుంచి వచ్చుచున్నారు? మీ కిచట యేమిపనియని అడిగెను. వెంటనే బ్రాహ్మణుడు ఓయీ ! యిచట ధర్మవ్యాధుడను నతనిని చూడవచ్చితినని పలుకగనే నమస్కరించి ఆ బాపని తన గృహమునకు తోడ్కొని వెడలెను.
బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని గృహము జూచి ఆశ్చర్యమును చెందుట
క్రమముగ కొంతదూరమున యున్న తన గృహములోనికి వెళ్ళుచూ బ్రాహ్మణుని వినయ విధేయతలతో గౌరవించుచూ ముంగిలిదాటి లోనికరిగి బ్రాహ్మణుని యొక ఆసనమున కూర్చొన నియోగించి, లోనయున్న తన తల్లిదండ్రుల నత్యంత గౌరవాన్వితముగ పూజించి వారిని తృప్తిపరచి వారిఅనుజ్ఞ గైకొని బ్రాహ్మణుని విచారింప నతనివద్దకు రాగా, అతని పితృభ క్తిని జూచిన కౌశికుడు చిన్నవోయిన ముఖముతో మాటలాడ జాలకుండెను. అది తెలిసిన ధర్మవ్యాధుడు నేను కులహీనుడను. మహాతపశ్శాలివి, బ్రాహ్మణోత్తముడవైన నిన్ను ఆ పతివ్రతా మహాతల్లి మా యింటికి బంపిన కారణ మేమగునో ? యని నుడువగానే బ్రాహ్మణుడత్యంత చకితాంతరంగు డాయెను.

