శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర


కక్కడు - గద్వాల మహాసంస్థానం

క్రీస్తుశకము 1650 సుమారు ప్రాంతమున నైజాము స్టేటునందు గద్వాలయను గొప్పసంస్థాన మొకటి యుండెను. సంస్థానాధీశుడు సుగుణవంతుడు, విద్వాంసుడు, అతిశయ ధన సంపత్తికలవాడు. రాజకార్య ధురంధరుడు. ప్రజా ప్రభుత్వమును ముఖ్యముగ మనంబున పెట్టుకొని ప్రజలందరను తన బిడ్డలవలె పోషణ జేయుచు మంచి కీర్తినార్జించి “గద్వాల మహాసంస్థానం”అన్న పేరు గడించినాడు.

అట్టి మహాసంస్థానంలో పెద్దగంటయ్య అనునతడు నరసమ్మ అనే భార్యతో కాపురము చేయుచు ఆ సంస్థానమున గుర్రాల కాపరిగా యుండెను. కొంతకాలము బంట్రోతుగ కూడ పనిచేసి యుండెను. ఆ దంపతులకు సుఖముగ కాలము గడుపుచున్నంతలో అనావృష్టి కారణముగ సంస్థానమునందు అంతటను “డొక్కల కరువు” యేర్పడెను. కరువుతోడనే ప్రజలు భాధపడు చుండుటకు ప్రభుత్వము విచారపడుచున్న సమయములో సంస్థానము మీదకు పొరుగు రాజులు దండెత్తి వచ్చినందున యుద్ధ భయభ్రాంతులైన ప్రజలు భిన్నా భిన్నులై సంస్థానమే భిన్న మైనటులకాగా, ఈ గంటయ్య గద్వాలును వదలి శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మముగారి మఠమునకు సమీపమునగల సోమిరెడ్డిపల్లె మజరానర్సనపల్లెలోని మాదిగ వాడకు నివాసము వచ్చెను.

ఇతడు జన్మతః మతంగ (మాదిగ) కులమునకు చెందిన వాడైననూ సచ్చరిత్రుడు. తన విషయమేదో తాను చూచుకొనుటయేగాని ఇతరుల విషయాలలో జోక్యం చేసికొనిఅనవసర ప్రసంగాలకు లోనుగాక నీతిగ జీవనము చేయుట నేర్చుకొనెను. కాలక్రమముగ ఇతని ధర్మపత్నియందు 1) పెద్ద మునెయ్య 2) చిన మునెయ్య, 8) నాగ మునెయ్య 4)కక్కయ్య అను నల్గురు కుమారులు జనించిరి. కాలవశమున పెద్ద మునెయ్య కలరావ్యాధితో గతించెను. రెండవవాడు చిన మునెయ్య తన ఆన్న గతించుటకు చింతించుచూ తల్లిదండ్రుల దుఃఖమును చూడలేక క్రమక్రమముగ సంసార సుఖాపేక్షలను విసర్జించి విరాగియై సన్యాసులలో కలసి దేశాటనకు వెడలి కడప ప్రాంతములో తిరుగుచు అచటనే సమాధి స్థితుడాయెను.

గంటయ్య ఆవేదన

పెద్ద కుమారులు ఇరువురు యీ విధముగ తనకు గానివారై పోవుటకు చింతించుచు గంటయ్య మూడవ కుమారుడైన నాగ మునెయ్యకు మంచి సంబంధము జూచి పెండ్లిజేసి మనస్సుకు సంతోషము, శాంతిని కలుగుచున్న కొలదికాలములోగా కుటుంబ పోషణ నిమిత్తము ధనార్జన జేసికొనివత్తుననుచు, నాగ మునెయ్య దేశదిమ్మరి తనముతో ఎంత కాలమునకు ఇంటికి చేరనందున గంటయ్య ఆవేదన భరింపరాని దాయెను.


కక్కయ్య వివాహము

పై పరిస్థితులకు గంటయ్య మనసుకుందుచుండిననూ తాను పెద్దవాడై వృద్దాప్యంవలన చేయునది లేనందున కడగొట్టు కుమారుడైన కక్కయ్యకు వివాహము చేయనెంచెను. ఎచ్చటెచ్చటనో తిరిగి, తెలిసి తెలియనివారితో శ్రమపడనేరక తన కుటుంబ స్థితిగతులను నడవడిని ఎరిగి మంచితనమును పూర్తిగా గ్రహించిన తన నివాసమగు నర్సనపల్లెలో పేరు ప్రతిష్టలు కలిగి పెద్దింటివారను పేరుగలిగిన హరిజనుడైన సోమిరెడ్డి పల్లె పెద్దవీరప్ప కుమార్తె ముత్తెమ్మను కక్కనికి పెండ్లిచేసి నర్సనపల్లెలోనే స్థిర నివాసము కలవాడాయెను.


కక్కయ్య సచ్చారిత్రత

పెద్దవారైన తల్లిదండ్రులకు తనకంటే పెద్ద సంతానముతో కలిగిన దుఃఖమును మనస్సునకు రానీయకుండా తాను వేయికండ్లతో కనిపెట్టి తల్లిదండ్రులకు సంతోషకరములైన పనిపాటలను చేయుచు సకాలమునకు వారికి భోజన సౌకర్యములను కల్పించుచు, తన భార్యయు తానును అనేక విధములుగ సేవలు చేయుచుండెను. ఈ విధమగు సపర్యను జూచిన వారలకందరకు ఇతడు "అపర ధర్మవ్యాథుడు” అనుకీర్తి నార్జించగలిగెను.


ధర్మవ్యాధుడెవరు?

పూర్వకాలమున కౌశికుడను నొక బ్రాహ్మణుడు పెద్దలైన తల్లిదండ్రులను వదలి పెద్ద మహిమను సంపాదించ నెంచి తపస్సునకై అడవికి యేగెను.అచట కొంత కాలముమహానిష్ఠతో తపస్సునొనరించి సర్వనియమంబులను పాటించుతూ తన తపస్సు ఫలించినదని మనస్సునకు నమ్మకము కలుగువరకు ఉన్న వాడాయెను.

  • eshwari devi mattam
    kalagnani qr code