జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి సంక్షిప్త చరిత్ర


* మార్కాపురము గ్రామమందున్న పెదరెడ్డి వీరారెడ్డికి నాటిపాలకులు ఉరిశిక్షను విధించగ తన మహిమచే నిలిపి వేయించెను.

* అహంకారపూరితులగు "పెదారికట్ల గ్రామ విశ్వబ్రాహ్మణులను నిలువ నీడలేక కష్టాల పాలౌదురులే అని శపించెను.

* పెదారికట్ల మంత్రవేత్తలకు గర్వభంగ మొనర్చి వారిని తన శిష్యులనుగా అనుగ్రహించెను. మరియు పూజాద్రవ్యములన్నియు సమకూర్చి దీపారాధన చేయుటకు “నేయి” తేనందున, శిష్యులచే తటాకమందుగల జలమును తెప్పించి తన మంత్ర మహిమచే, “నీటిని నేతిగా" మార్చి, ఆరాధన మహెూత్సవములలో జ్యోతి ప్రజ్వలనము గావించి భక్తశిష్యాదులెల్లరునూ ఆశ్చర్యచకితులను చేసిరి.

* వినుకొండ గ్రామములో మంచినీటితో దీపాలు వెలిగించిరి.

* ఈతముక్కల గ్రామ ప్రజలకు మశూచి, గ్రహపీడలువంటి జాడ్యములు సోకకుండా “జ్వాలాముఖి” అను దేవతను ప్రతిష్ఠించి రక్షించెను. ఈతముక్కల గ్రామమునకు 20 కిలో మీటర్ల దూరములోగల సముద్ర మధ్యమున మునుగుటకు సిద్ధముగానున్న పడవలోగల ప్రయాణీకులను తన చీరపైట చెంగుతో సురక్షితముగా ఒడ్డునకు చేర్చి రక్షించెను.

దుష్టశిక్షణ.. సంస్కరణ

శ్రీ ఈశ్వరీమాత వాక్కులు అక్షర సత్యములైన కొన్ని దృష్టాంతములు

* మఠం ప్రాంగణంలోని వెలుగచెట్టు క్రింద శ్రీ ఈశ్వరీ మహాదేవి కూర్చొని నుండగ, శిరముపైన ఒక వెలగపండు పడగ యధాలాపంగ “ఓసీ నీ కడుపుడక” అని పలుకగా అప్పటినుండి ఆ వెలగచెట్టుకు కాసినపండ్లు చూచుటకు బాగుగా కనిపించినను లోపల ఉడికి కాటుక పట్టిన నల్లని రంగువలె ఉండేవని నాటి వృద్ధులు తెలపుచుండిరి.

* రామాపుర గ్రామ నివాసియగు “గోళ్ళ బావాజీ” ఒక యోగి పుంగవునివలె వచ్చి, తన వయస్సును గురించి అసత్యము పలికినందున, ఓయీ! అసత్యము చెప్పినందున నీ ఆయుష్సు క్షీణించిపోవుట తథ్యమని శ్రీ ఈశ్వరీదేవి చెప్పిన కొలది దినములలోనే ఆతడు మృత్యువాతపడెను.

పగడాల వర్తకులు

తన ఎడల అనుచితముగా ప్రవర్తించిన దుష్టులగు పగడాల వర్తకులను ఆగ్రహముతో తప్పుడు దృష్టితో చూసిన మీకు దృష్టి మాంద్యమగునని పలుకగా వారు దృష్టిని కోల్పోగా, తల్లీ మా తప్పిదాన్ని మన్నించి రక్షింపుడని పాదాక్రాంతులుకాగా, వారికి తన మహిమచే తిరిగి దృష్టిని ప్రసాదించెను. పగడాల వర్తకులు భక్తితో కానుకగా కోటకొమ్ముల అంచులు కలిగిన జరీతో కూడిన పట్టుచీర శ్రీ ఈశ్వరీ మాతకు సమర్పించిరి. ఈ పట్టు వస్త్రాధారణలో తమరి దర్శనం అనుగ్రహించమని కోరిన వర్తకుల కోరిక మేరకు అమ్మగారు పట్టుచీరతో భక్తులకు దర్శనమిచ్చారు.

వన్నూరమ్మ

ఆ సమయానికి ఉత్సవాలను చూసేందుకు వచ్చిన వనిపెంట ప్రాంత పాళెగత్తెయగు వన్నూరమ్మ చూపు శ్రీ ఈశ్వరీ మాత ధరించిన పట్టుచీరపై పడింది. శ్రీ ఈశ్వరీ మాత అమ్మగారు ధరించిన పట్టుచీరను వన్నూరమ్మ ధరించాలనుకున్నది. తన అనుయాయులతో భక్తులు సమర్పించిన చీరను అపహరించిన వన్నూరమ్మను, బుద్ధి కర్మానుసారె అన్నట్లు “ఓసీ! నిన్ను కొఱత వేయ” అని పలికిన కొంతకాలానికి మహమ్మదీయ పాలకులు వన్నూరమ్మను బంధించి “కొఱత శిక్షను విధించగ హతురాలయ్యెను. శ్రీ ఈశ్వరీ మహాదేవి నోట వెలువడిన “వాక్కులు” వెనువెంటనే అక్షర సత్యమై జరిగేవని విశ్వసించేవారు. అంతటి వాక్సిద్ధి గల మహా మహిమాన్వితురాలిగా శ్రీ ఈశ్వరీ మహాదేవిని జనులు జగన్మాతగ కొనియాడిరి.

భక్తాభీష్ట ప్రదాయిని

శిష్యులకు వస్తు ప్రసాదముల అనుగ్రహము

జగన్మాత శ్రీ ఈశ్వరీమహాదేవి శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వాములవారి వలనే కాలజ్ఞానమును, తత్వాలను రచించి వాటిని తన శిష్యులగు కలసపాడు గ్రామమునకు సమీపమునగల కొంగలరామాపుర గ్రామ జాతివర్తుల వంశస్థులకును మరియు బద్వేలు చెంతగల కోనసముద్ర ప్రాంత నాయీబ్రాహ్మణులకు వారి కోరిక మేరకు అమ్మ ప్రసాదంగా అనుగ్రహించిరి. శ్రీ ఈశ్వరీ మహాదేవి శిష్యులు ఆ కాలజ్ఞాన ప్రతులతో పాటు అమ్మగారు వాడిన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచి భక్తిప్రపత్తులతో ఇప్పటికినీ అమ్మవారికి ప్రతిరూపంగా పూజించుచుండిరి. భక్తుల కోరికలు తీర్చు భక్తాభీష్ట ప్రదాయినిగా కీర్తింపబడిరి.

పరిసమాప్తి లేని అవతారమూర్తి

“సర్వభూతస్థమగు ఆత్మ భగవత్స్వరూపమేయని” ఉద్బోధించుటయేకాక కుల, మత, జాతి భేదములకు అతీతముగా ఎల్లరను తన శిష్యులనుగా స్వీకరించి ఎన్నో మహిమలను, అద్భుతములను చూపి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానమును కూడా బహుళ ప్రచార మొనరించిన తదుపరి శ్రీ ఈశ్వరీమహాదేవి అశేష ప్రజలు, భక్తశిష్యాదులకు కడసారిగా కాలజ్ఞానాది విషయములను ప్రబోధించి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ప్రబోధమే మనకిక శరణ్యమని చెప్పి కలియుగాబ్ది 4890, ఆంగ్లశకం 1789 సంవత్సరమునకు సరియగు శ్రీ సౌమ్య నామ సంవత్సరం మార్గశిర బహుళనవమి పర్వదినమున భేరీమృదంగ వాద్యములతో వెడలి పండితవరేణ్యుల వేదోక్త మంత్రోచ్ఛరణలతో సజీవ సమాధి నిష్ఠ యందు ప్రవేశించిరి.

నాటి నుండి జగత్పూజ్యురాలు, భవిష్యవాణి, మహా మహిమాన్వితురాలు, తపోనిష్ఠా గరిష్ఠురాలైన, శ్రీ ఈశ్వరీ మహాదేవి పవిత్ర ఆరాధన మహోత్సవము మార్గశిర బహుళ నవమి రోజున, మరియు శ్రీ ఈశ్వరీమాత జయంతి మహోత్సవము శ్రావణ శుద్ధ పంచమి పర్వదినమున మరియు పూజ్య శ్రీ గోవిందస్వాములవారి ఆరాధనోత్సవము పుష్య శుద్ధ అష్టమి నాడు కందిమల్లయ్యపుర శ్రీ ఈశ్వరీమహాదేవి దివ్యమఠ ప్రాంగణము నందు వైభముగా జరుగును.