జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి సంక్షిప్త చరిత్ర


జేజినాయన సాక్షాత్కారం.. అనుజ్ఞ

జగన్మాతయగు శ్రీ ఈశ్వరీ మహాదేవికి, తన పితామహులైన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వాములవారు ఒక శుభదినమున స్వప్నమందు సాక్షాత్కరించి తన ఆశయాదర్శములనే మార్గదర్శకములుగా చేకొని, నావలెనె నీవు కూడా ఆత్మతత్త్వాన్ని దర్శించి, భవిష్య కాలజ్ఞానమును రచించి బహుళ ప్రచారము చేయుమని ఉద్బోధించి, అఖండ ఖ్యాతినార్జించి, సజీవ సమాధి నిష్ఠ వహించి, జగత్పూజ్యురాలివిగా ప్రసిద్ధి నొందెదవని ఆశీర్వదించి, ఆదేశించిరి. ఈ స్వప్న సాక్షాత్కారం వృత్తాంత మంతయూ శ్రీ ఈశ్వరీదేవి తన తండ్రిగారైన శ్రీ గోవిందయ్యాచార్యులవారికి తెలిపిన పిదప “ఈశ్వరీ నీకు జేజినాయన అనుజ్ఞ అయినదని” తెలిపి శ్రీ గోవిందయ్యాచార్యులవారు కారణమాత్ర గురూపదేశమును ఈశ్వరీదేవికి అనుగ్రహంచారు.

లోక కళ్యాణార్ధం తపస్సు

మాతాపితరులగు శ్రీ గోవిందయాచార్యులు, గిరియమ్మలు తమ జ్యేష్ఠ పుత్రికయగు శ్రీ ఈశ్వరమ్మకు పరిణయము చేయుటకు సంకల్పించి తగు ప్రయత్నములను చేయుచుండుటను తెలిసికొన్న శ్రీ ఈశ్వరీ మహాదేవి తాను జేజినాయన ఆజ్ఞానుసారం మహాయోగ తపోనిష్ఠయొనర్చి పరబ్రహ్మ సాక్షాత్కారముచే శాశ్వత బ్రహ్మానందమును పొందదలచితినని తెలియచేసి, కందిమల్లయ్యపల్లె గ్రామమునకు నైఋతిదిశగా సుమారు 4 కి.మీ సమీపంలోగల నల్లమల అరణ్య ప్రాంతమందున్న కంచర్ల మర అనెడి కొండగుహలో లోకకళ్యాణార్థము కఠోర తపమాచరించిరి. శ్రీ ఈశ్వరీ మహాదేవి తపమాచరించిన పర్వత గుహప్రాంతము ఇప్పటికినీ పసుపు, కుంకుమ కాంతులతో ఎంతో శోభాయమానముగా ప్రకాశించు చుండుటను చూచిన, యాత్రికులు కడుసంతుష్టులై శ్రద్ధాభక్తులతో నిత్యపూజలను జరుపు చుందురు.

దేహభ్రాంతికి తగిన ఫలితము

శ్రీ ఈశ్వరీదేవి జేజినాయన ఆజ్ఞానుసారం అష్టాంగ యోగనిష్ఠను ఆచరించి తన శరీరాన్ని తప్త కాంచనం చేసుకున్నారు. మానవాళికి వేదసారమైన జేజినాయన బోధనలను చేరువ చేయుటకు లోక కళ్యాణార్ధం తన స్వీయకల్యాణాన్ని త్యజించారు. శ్రీ ఈశ్వరీ దేవి యోగదేహం యొక్క సౌందర్యానికి తన మేనమామ ముగ్ధుడై వంకర బుద్ధితో అమ్మవారి పట్ల అనుచితంగా వ్యవహరించినా తండ్రిలాంటి వాడివని హద్దుమీర వద్దని సున్నితంగా హెచ్చరించారు. అవేవి పట్టించుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తించిన తన మేనమామను దేహబ్రాంతితో కన్నుమిన్ను కానక మిడిసిపోతున్న నీవు నీ దేహం అందవికారమై పోతుందని పలికిన ఈశ్వరీ మాత వాక్కు ప్రభావం వలన తన మేనమామ శరీరం మీద పొట్టులేచి, కొంతకాలానికి పొక్కులు కట్టి, చివరకు శేష జీవితమంతా కుష్టువ్యాధితో చేసిన తప్పుకు శిక్షను అనుభవించాడు.

ఆశ్రయించిన వారిని శిష్యులుగ అనుగ్రహించారు

శ్రీ ఈశ్వరీ మహాదేవి శిష్యులలో కందిమల్లయ్యపల్లెకు చెందిన చాటకొండు సుబ్బయ్యశ్రేష్ఠి, దేచవరం గ్రామస్థుడు విశ్వబ్రాహ్మణుడగు యోగి సుబ్బయాచార్యులు ప్రముఖులు. కోన సముద్రం వాస్తవ్యుడు నాయీ బ్రాహ్మణుడైన గొడుగునూరు సుబ్బయ్య, బలిజ వంశుకులైన కొంగల రామాపురం నివాసి తుపాకుల వెంకట నరసయ్య మరియు కందిమల్లాయపల్లె వాసి బంగారయ్య తదితరులు శ్రీ ఈశ్వరీమాత శిష్యులుగా చరిత్ర కెక్కారు. శ్రీ ఈశ్వరీ మాతను ఆరాధించిన చరిత్రకెక్కని శిష్యులనేకురని ప్రశస్తి. పాట.. ఈశ్వరి నిన్నె నమ్మితి

తండ్రి యోగసమాధి మఠం నిర్మాణము

కందిమల్లయ్యపల్లె శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు ప్రథమ మఠాధ్యక్షులును జనకులగు శ్రీ గోవిందయాచార్యులవారు పుష్య శుద్ధ అష్టమి నాడు సమాధినిష్ఠ వహింపగా, శ్రీఈశ్వరీ దేవి జనకుల దివ్యయోగ సమాధికి గర్భాలయము నిర్మించి, శిష్యప్రశిష్యులతో కూడి ఆరాధన మహెూత్సవములను నిర్వహించుటయేకాక కాలజ్ఞానాది విషయములను ప్రబోధించెడివారు. తన జేజినాయనగారగు వీరబ్రహ్మేంద్రస్వాములవారి సజీవసమాధి (మఠము) నకు తూర్పుదిశగా ఉన్న స్థలమును స్వీకరించి ప్రత్యేక మఠమును నిర్మించుకొని ఆ చిన్న మఠము నాకు పూజ్యగురు స్థానమును అలంకరించి ప్రథమ మఠాధ్యక్షురాలిగా మఠాధిపత్యమును చేపట్టి పూజాకార్యక్రమములను కూడా నిర్వహించిరి. నాటినుండి ఆ చిన్నమఠము శ్రీ ఈశ్వరీ దేవి మఠముగ పేరొందినది.

జ్ఞాన దీప్తి.. పర్యటనలు.. బోధనలు

శ్రీ ఈశ్వరీ మహాదేవి భక్తశిష్య సమేతముగా దేశము నలుచెఱగుల వీరబ్రహ్మేంద్రస్వాములవారు ప్రవచించిన కాలజ్ఞానాది తత్త్వములైన శ్రీ వీరగురుని రచనలలోని వేద, వేదాంగ, వేదాంత విజ్ఞానమును పంచపంచకు, సరళమైన భాషలో విస్తృత ప్రచార మొనరించుటయేకాక సర్వభూతనమగు ఆత్మకు కుల,మత,జాతి భేదములు లేవని, అజ్ఞానులను సుజ్ఞానులనుగా చేయుచు, జాతిని జాగృతపఱచి, జీవన్ముక్తి, అద్వైత తత్వములను జనులకు ప్రబోధించి సంఘము నందు ఎందరినో సంస్కరించిన భక్త సంరక్షణి.

శిష్ట రక్షణ.. ఆశ్రిత జన కల్పవల్లి

సాక్షాత్తు పరమేశ్వరిగ అమ్మవారి మహిమలు

* శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వాములవారిచే అహోబిల మహారణ్యమున శపించబడిన బ్రహ్మరాక్షసికి జేజినాయన అనుజ్ఞచే తన మంత్ర మహిమ ద్వారా స్త్రీరూపము వచ్చునట్లుగా అనుగ్రహించి శాపవిముక్తి రాలినిగా చేసిరి.

* గిద్దలూరు సమీపంలోని “తురిమెళ్ళ” అను గ్రామములో స్వస్థురాలిగానున్న బాలికను బ్రహ్మరాక్షసి ఆవహించి నానా హింసలు పెడుచున్నందున అన్నాహారములు లేక క్రుంగికృశించి ఇక మరణావస్థకు చేరువగానున్న ఆ బాలికకు తన తపోమహిమచే ఆ బ్రహ్మరాక్షసి నుండి విముక్తిని ప్రసాదించి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలినిగా చేసిరి.

* “పొదిలి” గ్రామములో భయంకర కుష్ఠు వ్యాధిగ్రస్తుని, తన అమృత కరస్పర్శచే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసెను.

* మార్కాపురము నందు ఒక బొడ్డురాయిని ప్రతిష్ఠించి ఆ గ్రామప్రజలందరి ఆరోగ్యమును పరిరక్షించెను.