జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి సంక్షిప్త చరిత్ర


సాక్షాత్తు శ్రీమత్ విరాట్ స్వరూపమే శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వాములవారిగా కలియుగాబ్ది 4709, ఆంగ్లశకం 1608 సంవత్సరమునకు సరియగు శ్రీ కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీ ప్రకృతాంబ, పరిపూర్ణాయాచార్యులను విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులకు సరస్వతీ నదీ తీరమున పుత్రునిగా అవతరించి, అత్రిముని ఆనందాశ్రమములో "వీర నారాయణ” పేరిట బాల్యమును గడిపి ఆ తదుపరి కర్ణాటక పాపాఘ్ని మఠం పీఠాధిపతులైన శ్రీ యనమదల వీరభోజయాచార్య ధర్మపత్ని వీరపాపమాంబ యగు విశ్వబ్రాహ్మణ దంపతులకు దత్తపుత్రుడై వీరంభొట్లయ్య, వీరప్పయ్య, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారనే త్రినామ ధేయములతో మానవులలో ఒక సామాన్య మానవునివలె సంచరించి, త్రికాలజ్ఞానమును ప్రబోధించి ఎన్నో మహిమలను చూపి, కుల, మత, జాతి, భేదములకు అతీతముగా ఎల్లరను శిష్యులనుగా అనుగ్రహించి, తాను సజీవ సమాధినిష్ఠ వహించుటకు ముందుగా శ్రీ గోవిందయాచార్యులవారితో "పుత్రా! నిన్ను మఠాధిపతిగా నియమించెదనని తెలుపగ, శ్రీ గోవిందయ్య జనకులగు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారితో "తండ్రీ! తమరు అధిష్టించిన వీరధర్మజ సింహాసనముపై ఆసీనుడనై పీఠాధిపత్యమును నిర్వహించుటకు తగిన యోగ్యత నాకున్నదా!” యని సందేహాన్ని వెలిబుచ్చగా, "బిడ్డా! విచారింపవలదు. నా సంతానంగా నీవు జన్మించినందుననే అట్టి అర్హత కలదనియు మరియు అనతి కాలముననే నీకును “ఆ జగన్మాతయే జన్మతః బ్రహ్మజ్ఞానియైన జ్యేష్ఠ పుత్రికగా” అవతరించుననియు, ఆమెనోట వెలువడిన వాక్కులు వెనువెంటనే తప్పక జరుగుననియు, తాను కూడా నావలెనే తపోనిష్టాగరిష్ఠురాలై ఎన్నో మహిమలు, అద్భుతములను చూపి, కాలజ్ఞానమును కూడా రచించి బహుళ ప్రచారము గావించి, కలిమూఢులగు మనుజుల మనమున జ్ఞానజ్యోతులను వెలిగించి, అశేష భక్తజనావళికి, పండిత ప్రకాండులకు కాలజ్ఞానాది అద్వైత విషయములను ప్రబోధించి సజీవ సమాధి నిష్ఠ వహించుననియు, నా మఠమందు ఏ విధమగు పూజాధికములు జరుగునో ఆమె మఠమందున అదే రీతిగా పూజా కార్యక్రమములు జరుగుననియు, సూర్యచంద్రాదులున్నంత వఱకు సర్వత్ర పూజనీయురాలిగా సుఖ్యాతిని బడసి జగత్పూజ్యురాలు కాగలదని, అనునయించి తన పుత్రుడగు శ్రీ గోవిందయ్యాచార్యులను మఠాధిపతిగా వైశాఖ శుద్ధ సప్తమినాడు అభిషిక్తునిగా చేసిరి.

జ్ఞానప్రబోధ చేసిన తదుపరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు అష్టాంగ యోగ నిష్ఠనొంది "అహం బ్రహ్మాస్మి" అని వచించుచు పరమాత్మానుభూతిని పొంది కలియుగాబ్ది 4794, ఆంగ్లశకం 1693 సంవత్సరమునకు సరియగు శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పవిత్ర సజీవ సమాధినిష్ఠ వహించారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు సజీవ సమాధినిష్ఠ యందు ప్రవేశించిన దశమ వత్సరములో కలియుగాబ్ది 4804, ఆంగ్లశకం 1703 సంవత్సరమునకు సరియగు శ్రీ చిత్రభాను నామ సంవత్సర ఫాల్గుణ బహుళ దశమి నాడు శ్రీ గోవిందమ్మగారు శ్రీ స్వామివారి సన్నిధానంలోనే సమాధినిష్ట వహించిరి.

జగన్మాత శ్రీఈశ్వరీ మహాదేవి జననము

ఆ తదుపరి ఒక సంవత్సరమునకు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అనుగ్రహం ఆదేశానుసారం కందిమల్లయ్యపల్లె శ్రీ వీరబ్రహ్మ క్షేత్ర మఠాధిపతులగు శ్రీ గోవిందయ్యాచార్య ధర్మపత్ని గిరియమ్మ పుణ్యదంపతుల గర్భ శుక్తి ముక్తాఫలముగా, కలియుగాబ్ది 4804, ఆంగ్లశకం 1703 సంవత్సరమునకు సరియగు శ్రీ స్వభాను నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినమున “పుత్రికా” సంతానము కలుగగా ఆ శిశువుకు "ఈశ్వరమ్మ" అని పేరిడి అతిగారాబముగా పెంచు చుండిరి. తరువాత ఇరువురు పుత్రికలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అను ఇరువురు పుత్రులను సంతానముగా పొందిరి. పరాశక్తి అంశతో అవతరించిన ఈశ్వరమ్మ మరియు సోదరీమణులైన కాశమ్మ, శంకరమ్మలు మువ్వురును శక్తిస్వరూపిణిలుగ పేర్కొనబడిరి.

బాల్యము – విద్యాభ్యాసము

వీరిలో ప్రథమ పుత్రికయగు "శ్రీ ఈశ్వరమ్మ మహా మహిమాన్వితురాలిగా” నుఖ్యాతిని పొందెను. జన్మత: పరాశక్తి అంశ సంభూతురాలగు శ్రీ ఈశ్వరీ మహాదేవి బాల్యమందునే ఆధ్యాత్మిక విషయ వాంఛాసక్తురాలై, సాధుసజ్జనుల సాంగత్యము మరియు నద్గంథ పఠనముపట్ల శ్రద్ధతో, రామాయణ, భారత, భాగవత, పురాణేతిహాసములను, ఉపనిషద్రహస్యములను, పతంజలి యోగ శాస్త్రమును సాంగోపాంగముగా అభ్యసించుటయేకాక తన జనకులగు శ్రీ గోవిందయాచార్యుల చెంత దివ్య మంత్రోపదేశమును కూడ పొంది, నిరంతర బ్రహ్మజ్ఞానాసక్తురాలిగా భాసిల్లుచుండిరి.

శ్రీ ఈశ్వరీ మహాదేవి బాల్యమునందు యుండగనే, మూడుదినములుగా నిశ్చల సమాధినిష్ఠలోయున్న తనతండ్రి నాటి మఠాధిపతులైన శ్రీ గోవిందయాచార్యులవారిని యోగనిద్రనుండి తన మహిమచే అత్యంత చాకచక్యముగా మేల్కొల్పి ఎల్లరను అశ్చర్యచకితులనుగా చేసిరి.

శ్రీ ఈశ్వరీ మహాదేవి పసిప్రాయమునందే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వీయ రచనలగు భవిష్య కాలజ్ఞాన వాక్యములను, తత్వములను సుమధురముగా గానముచేయుచు, మఠమందు జరుగు ఆరాధనాది తదితర పూజా మహోత్సవములలో పాల్గొనుచు తన పితృదేవులగు శ్రీ గోవిందయ్యాచార్యులకు బాసటగా నిలచినారు.

కళ్యాణ నిర్ణయము

“నగరిపాడు”ను పాలించే క్షత్రియుడైన జగ్గరాజుకు లేకలేక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆశీర్వాదమువలన జన్మించిన పుత్రుడగు “రంగరాజు” శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి దర్శనార్థమై మఠమునకు వచ్చి శ్రీస్వామివారి సన్నిధానంలో జేజినాయనను సుమధురముగా స్తుతించుచున్న యుక్తవయస్కురాలైన శ్రీ ఈశ్వరీదేవిని చూసిన రంగరాజు, ఆ దేవి ఎవరో తెలుసుకున్న తర్వాత తనకు ఇచ్చి వివాహము జరుపుడని శ్రీ గోవిందయ్యాచార్యులుగారిని సంప్రదించగా అందులకు మఠాధిపతులగు శ్రీ గోవిందయ్యాచార్యులుగారు నిరాకరించిరి. రంగరాజు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి వరప్రభావము వలననే జనియించిన తాను శ్రీఈశ్వరమ్మగారినే వివాహమాడెదనని పట్టుబట్టెను. శ్రీ గోవిందయ్యాచార్యులు, పోతులూరయ్యాచార్యులు మా జనకులగు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు మీ వివాహము గురించి వారి కాలజ్ఞానమునందు పేర్కొన్నచో తప్పక ఆ విధముగనే జరిపించెదమని నిశ్చయించిరి. శ్రీ పోతులూరయ్యగారు, రంగరాజును తీసికొని మఠము నుండి బయలుదేరి బనగానపల్లె గ్రామమునకు వెళ్ళి అచ్చమ్మగారి ఇంట కాలజ్ఞాన పాతరలోగల కొన్ని కాలజ్ఞాన ప్రతులను తీసికొనివచ్చి, కందిమల్లయ్యపల్లెలో పెద్దల సమక్షమున వాటిని పరిశీలించగా అందున రంగరాజు ఈశ్వరమ్మల వివాహ ప్రసక్తి గురించి లేనందున, నిరాశతో రంగరాజు “నగరిపాడుకు" వెళ్ళి అగ్నిప్రవేశమును చేసిరి.