శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • ఓ మాతేశ్వరీ! అట్టి కాలములో ధర్మమార్గము బోధించు ధర్మాత్ములు ఉండరా! దేవీ అనగా! భక్తులారా ! ధర్మాత్ములు అనుభవముతో చెబితే తలూపుచు వినేరు కానీ వారిలో విషగుణాలు నిండియుండును. గురుదూషణలు చేయుచు శివాభిమానము దప్పి అక్రమ కార్యాలు చేయుదును. శివాభిమానులు దైవ ధ్యానము చేయుచు తమతమ స్థానములో నివురుకప్పిన నిప్పువలె దాగి యుందురని చెప్పెను.

    ఈశ్వరిదేవి తన నిర్యాణకాలము సమీపించునట్లు యోగదృష్టిచే తెలసికొని సోదర సోదరిణీలను, సుబ్బయ్యను పిలిపించుకొని నేను ఇదే సంవత్సర మార్గశిర మాస కృష్ణ పక్ష నవమినాడు సజీవసమాధి కాబోవు చున్నాను. రేపటి నుండి నేను ఏకాంతవాసమందు జేజనాన్న గారిని ధ్యానించుచు ఒకరోజు ముందు వత్తునని చెప్పి ఏకాంత వాసములోనికి వెళ్ళెను.

    భక్తులందరు సమాధి కొరకై అన్ని సిద్ధముచేసి ఈశ్వరీ మాతేశ్వరీ జీవసమాధి అగుచున్నధని శ్రీముఖములు వ్రాసి ఊరూర పంపించిరి. అవి చూచుకొని చుట్టు గ్రామాల ప్రజలు వచ్చుచు కందిమల్లయపల్లె గ్రామములో జనులు అందరు తమ తమ ఇండ్లను, అలంకరించుకొని వీధులలో పచ్చని తోరణాలు కట్టి అలంకరించి యుంచిరి.

    ఈశ్వరిదేవి ఒకరోజు ముందు ఏకాంతవాసము నుండి వెలపలికి రాగానే అందరు హర్షధ్వనులు చేయుచు ఆ దేవిని బ్రహ్మరథముపై ఎక్కించి ఊరేగింపు చేయుచు మఠము ముందుకు రాగానే ఆ దేవి రథము దిగి జేజనాన్నగారి జీవసమాధిని పూజించి దక్షణామూర్తి ఆమె చేతికిచ్చిన కాలజ్ఞాన గ్రంథాలు సమాధి దగ్గర వుంచి, తర్వాత తలిదండ్రుల సమాదుల పూజించెను. తదుపరి సోదర సోదరిమణీలు ఆమెకు అభిషేకము చేయించి పట్టు పితాంబరములు కట్టించి పాదపూజ చేసిరి.

    క్రీ॥శ॥ 1768 సర్వధారినామ సంవత్సర మార్గశిర మాస కృష్ణ పక్ష నవమి రోజున గర్తములో దిగి అందరిని ఆశీర్వదించుచు పద్మాసనము వైచి కూర్చుండి నేత్రములు మూసి ప్రాణాయామ మొనర్చుచు శాశ్వత యోగనిష్ఠ వహించెను. తదుపరి సోదర సోదరిణీలు సుబ్బయ్యా చార్యులు పై మూత బిగించిరి. నాటి నుండి సుబ్బయ్యాచార్యులు మఠాధిపతులుగా నుండి నిత్య పూజలు సత్యముగా జేయుచు ప్రతి సంవత్సర మార్గశిర మాస కృష్ణ పక్ష నవమినాడు ఆరాధన ఉత్సవము గొప్పగా జరుపుచున్నారు.


    గద్య

    ఇతి విశ్వజ్ఞకుల సంభవ సుపర్ణ బ్రహ్మర్షి గోత్రః

    నారాయణ దాసు వంశ అంబమాంబ పురుషోత్త

    మా చార్య పౌత్ర రుక్మిణీదేవి నరసాచార్య

    ప్రథమ పుత్రరత్నబొజ్జయాచార్య

    సహోదర శ్రీరామాచార్య కృత

    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి

    వంశచరిత్ర