శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • చేయరాని యకృత్యాలు చేయబోకు

    సింహాసనము సిద్దమైయున్నది

    సీతాభగవతీ స్థిరమైయున్నది కనుక

    ఇది సిద్దమగువారిచే సిద్దించును

    ఇది దేవరహస్యపు పలుకులు " కాల,చతుర్ధ, పేజీ 22

    రంగరాజా! విన్నావు గదా ఈ దేవరహస్యము నాకు బోధపడుట లేదనగా

    అయ్యా! నాకర్థమైనది, ఈ జన్మలో మీ కూతురుకు నాకు వివాహ యోగము లేదు. వచ్చే జన్మలో నాకు రాజసింహాసన పట్టాభిషేకము జరుగును. తదుపరి ఈశ్వరమ్మగారు వచ్చే జన్మలో రాణిగా జన్మించును. అపుడు మాకు వివాహము జరుగునని స్థిరపరిచినారు మరియు నేను ఈ జన్మలోనే చేయరాని ఆకృత్యము చేసినందుకు అగ్నికి ఆహుతి కావలెనని స్థిరపరిచినారు. శ్రీవారి ఆజ్ఞానుసారం నేను అగ్నికి ఆహుతి అగుదును. తదుపరి ఆ స్థానమందే గుడి గట్టించి పూజించవలెను. విశ్వబ్రాహ్మణులే అర్చకులుగా నుండవలెననగా పోతులూరయ్య విని, రంగరాజా! నీ యభిష్ఠము నెరవేరనిది సమాధుల పూజించుట మహాయోగీశ్వరులకే కాని సామాన్యులకు అట్లుండదు నీ మహాత్మ్యము లోకులకు సాదృశ్యమైన నమ్మకము గలిగినపుడే నమ్మి పూజింతురు అనెను.

    అయ్యా! నేను మా గ్రామములోనే శ్రీ వీరగురుని యంత్రము నా చేతిలో యుంచుకొని దహన మగుదును. ఆ సమయములో సూర్యుడు మీకు రక్తవర్ణముగా కనుపించును. ఆదియే మీకు సాదృశ్యము అపుడు మీరు వెంటనే నా దహన స్థానమునకు వచ్చి ముమ్మారు నన్ను పిలిచిన మీకు ఈ యంత్రము అందింతును. ఆ యంత్రమును అచటనే ప్రతిష్టించవలెను. ఇంతకంటే మరేమి నిదర్శనము కావలెననగా పోతులూరయ్య గారికి సంశయము గలిగెను. అది గమనించిన రంగరాజు అయ్యా! దాహము తీర్చగలరా! అనగా పోతులూరయ్యకు సంధి తెలియక తన కూతురు నీలమ్మతో చెప్పి చెంబుతో నీళ్ళు తెప్పించెను. అది చూచి నీలమ్మ నీటిపాలు రంగడు అగ్నిపాలు అనిచెప్పుచు యంత్రము దీసికొని అటునుండి వెళ్లిపోయెను. రంగరాజు వెళ్లిన కొద్దిక్షణాలకే నీలమ్మ నీటిచెంబు చేతిలో యుంచుకొని జీవన్ముక్తి జెందెను. రంగరాజు నగరపాడు చేరికొని జరిగిన వివరములు అన్నియు తండ్రితో చెప్పి అగ్నికి ఆహుతి కావలెనని చెప్పగా తండ్రి

    కం|| పుట్టినది మొదలుచే

    పట్టియు ముద్దాడుకొనుచు బహువిధముగచూ

    పెట్టుకొని యుంటి నిన్నాళ్ళు

    పట్టుగ నినుబిలిచె బ్రహ్మ పరలోకమునకున్ ప్ర. నిష్ప్ర

    కుమారా! గురువును నమ్మి పూజించినవారు అంత్యమున గురువు చెంతకే జేరుదురు. నీ ఇష్ఠ ప్రకారమే కానిమ్మని చెప్పెను. రంగరాజు శుచియై అగ్ని సంస్కారమునకై తానే స్వయముగా కట్టెలు పేర్చుకొని అగ్నిని ప్రజ్వలింపజేసి తండ్రి పాదములకు నమస్కరించి గురుయంత్రము చేతపట్టుకొని అగ్నిలో దూకి అదృశ్యుడు ఆయెను. ఆ సమయములో కందిమల్లయపల్లెలో పోతులూరయ్యకు సూర్యుడు రక్తవర్ణముగా కనుపించెను వెంటనే గుర్రము నెక్కి అతివేగముగా నగరపాడు చేరికొని దహన స్థానము సమీపమునకు రాగానే అంత దహనమై యుండెను. ఆ స్వామి ముమ్మారు రంగరాజును పిలువగా ఆ అగ్నిలో నుండి ఒక హస్తము బయటికి వచ్చి గురుయంత్రమును పోతులూరయ్యస్వామి చేతికిచ్చి ఆ హస్తము అదృశ్యమాయెను.

    అచట గుమిగూడిన గ్రామ ప్రజలంతా ఆ స్వామికి నమస్కరించగా ఆ స్వామి వారిని వుద్దేశించి నగరపాడు గ్రామ ప్రజలారా! వీరబ్రహ్మేంద్రస్వామి ఇచ్చిన యంత్రమహిమ చూచితిరి గదా ఇచటనే ఆలయము కట్టించి గురుయంత్రము ప్రతిష్ఠించి పూజించుచుండిన మీకు మీ గ్రామమునకు క్షేమమని చెప్పగా ఆ స్వామివారి ఆజ్ఞానుసారము అచట ఆలయము గట్టించి ఆ స్వామివారి చేతనె యంత్రమును ప్రతిష్ఠింపజేసి పూజించుచుండిరి. నేటికి దర్శించవచ్చును.

    దక్షిణామూర్తిగారి చరిత్ర

    దక్షణామూర్తి తండ్రిగారి ఆజ్ఞానుసారము దేశము నలుదిశలు సంచరించుచు కాలజ్ఞాన సారాంశము బోధించు చుండగ ప్రజలు ఆకర్షించి ప్రతి గ్రామ ప్రజలొచ్చి ఆస్వామిని తోడుకొని వెళ్లి వారు చెప్పుచున్న కాలజ్ఞాన సారాంశములు శ్రద్ధతో వినుచు శక్తికొలది కానుకలు ఇచ్చుచుండిరి. భక్తులిచ్చిన కానుకలు కందిమల్లయపల్లెకు పంపుచుండెను.

    మజిల్పుర గ్రామ ప్రజలు ఆ స్వామిని ఆహ్వానించి కలియుగ నడతలను తెలుపుడని వేడగా! ప్రియమైన జనులారా! భారత యుద్ధము ముగిసిన తదుపరి మన దేశము పరిషత్తు మహరాజు పాలించెను. వీరి తదుపరి వీరి కుమారుడు జయతేజయుడు పాలించెను. ఆ తదుపరి వీరి కుమారుడు విక్రముడు కలియుగము 3043 లో పాలించెను. తదుపరి 3101లో మన దేశము హూణులు పాలించిరి 3179 లో శాలివాహనులు పాలించిన తదుపరి కలియుగము 3680లో స్వాధీనమాయెను. వీరి పరిపాలనలో అక్రమాలు ప్రబలుచు ఆలయాలలో నున్న విగ్రహాలను భిన్నము చేయుచు ఆలయాలను మసీదులుగా మార్చి గోహత్యలు జంతుబలులు చేయుచు హిందువులను మహమ్మదీయ మతములో కలుపుకొను చుండిరి. భయభక్తులు లేక పెద్దల మాటలు పెడచెవిని బెట్టి హద్దుమీరిన పనులు చేయుచు పరదేశ విద్యలకు ప్రాబల్యమిచ్చుచు వేదవిద్యలనెల్ల నీట కలిపిరి అందులకే కాలజ్ఞానము అంది ఇలా అన్నారు. “బెండ్లు మునిగీని గుండ్లుతేలేని”