శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • సద్గురు దేవా! మీరు స్వప్న దర్శనమిచ్చిన నాటి నుండి నేను కులచర్యలు మాని గురుకుల చర్యను ఆచరింప కొరితిని మీ పాదసేవజేయుచు మీ సన్నిధానమందే యుండెదనని ప్రార్థించగా సిద్ధీకు వీరబ్రహ్మేంద్రుని పాదసేవ చేయుచుండెను. కొంతకాలము తర్వాత పిలిచి సిద్ధా! నీకిపుడు యుక్తవయస్సు మీ గ్రామము వెళ్లి వివాహము చేసికొని రమ్మనెను సిద్దీకు తన గ్రామము వెళ్లి గురువుగారు చెప్పిన మాట తల్లిదండ్రులకు చెప్పెను. తల్లిదండ్రులు సమ్మతించి అచ్చాంబీ అను కన్యను తెచ్చి వివాహము జేసిరి.

    దంపతులిద్దరు అల్లాడిపల్లెకు వచ్చి సిద్దీకు వీరబ్రహ్మేంద్రునికి, అచ్చాంబీ గోవిందమాంబకు సేవ చేయుచుండిరి. కొంతకాలము గడిచిన తదుపరి వీరబ్రహ్మేంద్రుడు సిద్దీకునకు మంత్రోపదేశముచేసి “అణవి” దీక్ష ఇచ్చెను.

    ఆణవి దీక్ష అనగా! గురుమంత్రము ఎలా జపించాలి ఏ సాధన, ఏ ఉపాసన చేయాలో తెలిసికొని మంత్రసిద్ది సాధించిన వారికి జన్మజన్మలకు ఆధ్యాత్మికము అవలంభించి మహనీయులగుదురు.

    * యోగీశ్వరుడైన దత్తర్షి వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించి నా అవసాన తదుపరి నీ పుత్రునిగా జన్మింతునని చెప్పగా, ఆ స్వామి తదాస్తు అనెను. తదుపరి దత్తర్షి ఆ స్వామికి పుత్రుడై జన్మించెను అ బాలునికి గోవిందయ్య అను నామకరణము జేసిరి.

    * చూడుడు ప్రపంచ నిష్ప్రపంచ కందార్థ సంగ్రహ పేజీ 135 వీరభద్రుని అంశములో పోతులూరయ్య జన్మించెను.

    షణ్ముఖుని అంశములో ఓంకారమయ్య జన్మించెను. విష్ణ్యాంశమున గిరిరాజయ్య జన్మించెను.

    * భైరవకోన వాసుకి ఋషి దక్షిణామూర్తిగా జన్మించెను.

    గరివిరెడ్డి అచ్చమ్మ వీరనారాయణమ్మగా జన్మించెను.

    వీరందరు తలిదండ్రుల ఆజ్ఞలో పెరుగుచు పెద్దవారైరి. వీరబ్రహ్మేంద్రస్వామి కుమారుల సమర్థలను బట్టి మంత్రోపదేశము చేసెను. తదుపరి సిద్దీకుని బిలిచి సిద్దా! ముందు నేను సజీవ సమాధి అగుటకు అనువైన స్థలము ఎక్కడ యున్నదో చూచిరమ్మని చెప్పెను. సిద్దీకు చుట్టు గ్రామాలు తిరుగుచు కందిమల్లయ్యపల్లెకు వచ్చి ఊరికి ఉత్తర దిశ గురువుగారి సజీవ సమాధికి అనువైన స్థలమిదేనని తిరిగి అల్లాడుపల్లెకు వచ్చి విన్నవించెను.

    వీరబ్రహ్మేంద్రస్వామి ఒక శుభ దినమున అల్లాడుపల్లె నుండి కుటుంబ సహితముగా కందిమల్లయపల్లెకు వచ్చి ఒక ఇంటిలో నివసించిరి. సిద్దీకు దంపతులు మరియొక ఇంటిలో యుండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామప్రజలకు గ్రామదేవత ఉత్సవము జరుపుటకొరకై స్వామివారి ఇంటికి వచ్చి చందా అడుగగా సమాధానము చెప్పనందున

    * చూడుడు ప్రపంచ నిష్ప్రప్రపంచ కందార్థ సంగ్రహము పేజీ 136

    మరునాడు రచ్చకట్ట దగ్గర సమావేశముజేసి గ్రామపెద్దలు ఆ స్వామిని పిలిపించిరి, వీరబ్రహ్మేంద్రస్వామి చుట్ట చుట్టుకొని దానిలో పొగాకు నింపి రచ్చకట్టు దగ్గరికి వచ్చెను. అయ్యలారా! నేను చుట్ట పీల్చుటకు నిప్పు తెప్పించగలరా! అనగా ఎవరేమి సమాధానము చెప్పలేదు. కొంతసేపు ఆలోచించి ఆ గుడివైపు చూచి, ఓ గ్రామ దేవతా వీరెవరు సమాధానము చెప్పలేదు. నేను చుట్ట పీల్చవలెను. నిప్పు తెచ్చి పెట్టుమని చెప్పగా, ఆ గుడిలోని శిలాదేవత మానవ రూపంలో తెల్లని చీరకట్టుకొని వెంట్రుకలు విరియబోసుకొని ఒక పాత్రలో నిప్పులుంచుకొని గుడిలోపలి నుండి బయటికి వచ్చి ఆ స్వామి ముందుంచి నమస్కరించి తిరిగి గుడిలోపలికి వెళ్లి శిలారూపమాయెను, ఆదృశ్యము చూచిన గ్రామ ప్రజలంత దిగ్భ్రాంతి చెంది బిరబిరవచ్చి ఆ స్వామికి పాద నమస్కారముచేసి క్షమాపణ వేడగ ఆ స్వామి అందరిని క్షమించెను.

    వీరబ్రహ్మేంద్రస్వామి మహిమా ప్రభావము తెలిసికొన్న గ్రామ ప్రజలు చుట్టు గ్రామాల ప్రజలు తమకు పండిన పంటలలో కొంత భాగము ఆ స్వామికి అర్పించుచు శ్రీవారి ఆశీస్సులు పొందుచుండిరి. బ్రహ్మంగారి లాంటి గురువు సిద్దయ్యలాంటి శిష్యుడు ఈ లోకములోనె లేరని పొగడు చుండిరి. ఆ ప్రాంతమున మహనీయునిగా ప్రఖ్యాతి చెందెను. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కుమారులకు కన్యలను ఇచ్చెదమనుచు ఆ ప్రాంతపు బంధువులు వచ్చుచుండిరి.

    కం|| పరగసుపర్ణగోత్రుడు

    సరసుడు లక్ష్మయ్య అతని సతిశాంభవియున్

    గిరిరాజమ్మను కన్యను

    వరగోవిందునకు నిచ్చె – వైభవమొప్పన్ ప్ర. నిష్ప్ర

    వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ పుత్రుడైన గోవిందయ్యకు నుసుమ గ్రామము నుండి సుపర్ణ బ్రహ్మర్షి గోత్ర లక్ష్మయ్యాచార్యుని కూతురు గిరిరాజమ్మను తెచ్చి, కూతురు వీరనారాయణమ్మను అదే గ్రామానికి చెందిన వేంకటాద్రయ్యకు ఇచ్చి ఈ రెండు వివాహాలు కందిమల్లయ్య పల్లెలో తన స్వగృహమందే జరిపించెను.

    తదుపరి కొన్నాళ్లకు ద్వితీయ పుత్రుడైన పోతులూరయ్యకు కొలుములపేట నుండి పార్వతమ్మ అను కన్యను తెచ్చి వివాహము జేసెను. తృతీయ పుత్రుడు ఓంకారమయ్యకు ఉత్పలపురము నుండి కామాక్షమ్మను తేచ్చి వివాహము జేసెను.

    చతుర్థ పుత్రుడు గిరిరాజయ్యకు అదే గ్రామము నుండి పాపమ్మను దెచ్చి వివాహము జేసెను. పంచమ పుత్రుడు దక్షణామూర్తి బ్రహ్మచర్య దీక్ష వహించెను. వీరందరు ఏక కుటుంబముగా నుండి తండ్రిగారి ఆజ్ఞను జవదాటకుండా నడుచుకొను చుండిరి.