
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము
-
భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము
(శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)
(1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)
ద్వితీయాశ్వాసము
శ్రీమద్రాజాధిరాజ రాజపరమ రాజేశ్వర రాజపరమేశ్వర రాజచూడామణి పంచరాజ బహురాజ పరమరాజోత్తమ చరాచర జగత్తు సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతిరూప సహస్రరూప సర్వరూప సదానంద స్వరూపులయిన అంతర్యోగ బహిర్యోగ ప్రకృతియోగ పరమయోగ బహుర్యోగ భావయోగ భక్తియోగ ప్రకటయోగ పాలనయోగ ప్రపంచయోగ వీరయోగులయిన విద్యాత్మ వేదాత్మ వివిధాత్మ విచిత్రాత్మ, జీవాత్మ నిర్జీవాత్మ పూర్ణాత్మ శతాత్మ అనంతాది సర్వాత్మ నాయకులయిన కుటిలసాగర గుణసాగర అగ్నిసాగర సోమసాగర సూర్యసాగర సర్వసాగర మహాసాగర అర్థివంతులయిన ప్రణవాక్షర పాలనశీల విశాల కులగోత్రమిత్ర అమిత్ర చిత్రవిచిత్ర వీర పురుషాఖ్యాతాది కేతనా నామకులయిన త్రేతాండయోగ అజాండయోగ సర్వాండసంయోగ వీరశక్తుండ వియోగపురుష కుపురుష సత్పురుష నిరుపమ పరమపురుష నిర్వికార నిరంజన నిగమవేద్య నిఖలాంతరవాస నిష్కళంక నిర్వాణ నిర్వికల్ప వికల్ప వినోదనాధ మోదితులయిన మహితహర దురితహర దుర్మధహర తామసహర దైత్యహర గుణహర అజహర అండజహర హారణ వేకోనారాయణ నామక సోమవంశోత్తమ తేజ వీరభోజరాజ మహారాజ రాజముఖాంతరాంతాది దశావతార విహార ప్రకాశ అనంత ఆవతార ప్రకాశ అత్యంత విహార వీరనారసింహ్మ నామఖండాగ్రేసర భీమప్రతాప్రతాప అఖండ నాయకులయిన దివ్యగణ మునిగణ శక్తిగణ సౌమ్యగణ అవతారగణ అఖిలగణ ఆఖిలశక్తిగణ పరమగణ సుగుణ సంపన్నులయిన అనంతవేద రహస్యజ్ఞాన విఖ్యాత చరిత్ర పవిత్రాంగ సత్యస్వరూపులయిన నిత్యానంద కృత్రిమావతార విహార అత్యంత గోప్యగూడజన్మ ప్రకాశ కారణజన్మ కార్యాంగధార్య ఆర్య సేవా ధురీణులయిన అంతరంగ ఆత్మసంగ బహిప్రకాశ ప్రపంచకసంగ నిఖిలనిస్సంగ సంగమద్వంస హంసావతార వీరపురుష సేవాంతరంగ శ్రీ గురువేన్నమః
ఆనంద కందళిత హృదయారవిందులయిన అలజాపురి ప్రతినామక దురితహర పురవాసులయిన భూసురోత్తమ మర్త్యప్రవర్తిక మహారాజ నోత్తములకు మమసమాగమ మహత్ మనోలయ జననలయ స్థాన సంప్రాప్త ఫలంబు సఫలమయ్యె ఫలమవునట్లుగాను ఆశీర్వదించి అంపించిన ఆరోగ్యజనిత విగ్రహానుగ్రహ సమగ్ర వక్కాణితమైన ముఖ్యమైన ముఖ్యలేఖ మీకు ఏకాదశేంద్రియ వ్యాపార పారంపరవాసమైన దివసంగలిగీని, విలయ కాలమునకు గుణ్యమైన కార్యాలు గలిగీని, గజిబిజి అయ్యీని, ఘన సమూహములు కలకబారీని, కంఠగతవాత ఘాతకమైన కాకబుట్టీని, కల్మషంబులు కాయంబులుతో నేకరింగీని, గ్రహగతులు సుగతులు దప్పి తిరిగీని, కాలమాన కల్పంబులకు వికల్పంబులు బుట్టీని, అధ్యాత్మయోగ పురుషుని మహత్ప్రకాశమయ్యీని, మహామన్నీలు కాలుమడచేరు. ముక్కొండ మల్లయ్యకు మ్రొక్కులు చెల్లీని, లంకమల రామేశుని రాకడ నిజమయ్యీని, సోమశిల గండి కనమ మార్గముననే ధుర్గాధిపతి దురిత భంజనుడైనక ధూర్జటి పర్యాయనామ సంవత్సర ద్విగుణ కాలాంతర త్రఈమాసాన భాసుర భానువారాన పంచాక్షర ప్రకాశ ప్రళయ నక్షత్ర దక్షణకాలానకు పక్షద్వయాన ప్రవేశమయ్యీని బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజరెల్లీని, లీలావతారంబులు లీనమయ్యీని, అంగాంగాలు హరించీని, ఆర్తజనానంద మయ్యీని, అంబుజ సంభవుని వ్రాత అంతమయ్యీని అధిక తేజోపరమేష్టి ప్రకాశ పరమ నదీప్రాంత పట్టణ ప్రవేశమయ్యీని, పరమ యోగీశ్వరుల కాలానకు పదులు మూడున్నూ, పంచక మొకటిన్నీ పై మాసాలు పదింటి మీద మమకుమార మహాప్రకాశ మయ్యీని, మలినంబులు మాశీని, మార్గశిరమాసానకు మందిరముజేరీని. మహానంది మార్గమునకు మరుగుకొండలు మూడు దాటిపోగా ఆడగాను యవ్వరుందురో వారే వచ్చే వీరభోగవసంతరాయులని వక్కానించినాము. యిది మీకు ఆనవాలు.
యిదిగాక మీకు మాకు మాలిమియైన మధ్యమ సుఖజన్మ స్థాన మందిరం. అడియాలం ఆదిస్తవ సందర్శనం సఫలమగుట గురుతు. మరిన్ని సపరివార సమేతముగా శంఖర సన్నిదానం సాక్షి, సర్వసాధారణమైన గురి, సంతతమున్ను సర్వఋషి. సమాగమ సపరివార సమేతముతో నేనున్నూ నిజభక్త హృదయాంతరాళమందు నిలచి నిఖిలవేద తత్వర హస్యతత్వ, మహాతత్వ, పరమతత్వ అధికాలాన కథాసందర్భమున్ను అజలయే గజ్ఞాన గత హేష్యజ్ఞానంబులును, గ్రంధరీత్య బంధురమైన భోధకముగా భోదిస్తున్నాము. గాన యిన్నిటికి హెచ్చైన ఆనవాలుగాన మానసంబున నిస్సంశయులై నిజముగయుండేది. నిర్ఘాతవాతఘాతకమయ్యీని, అగ్నిప్రకాశమయ్యీని, సకల చరాచరంబులకు సంతాపంబులు బుట్టీని, మహోత్పాతంబులు నలువంకలు నిలబడీని, సర్వజీవంబులు సంక్షోభించీని, సుజనులకు జనోపకారమైన పనిగనుక స్వామిద్రోహులకు సుగతి మార్గంబులు గలిగీని, అది ప్రేరితమైనశక్తి భీకరాకారియై కదాచిత్తుగా కానబడీని, దాని ఆర్భుటులచేత అఖిల భూతంబులకు మనోవికల్పంబులయ్యీని, ఆసమయాన మీరున్ను, మీ సహచరులున్ను, సపరివార జనంబులున్ను సహాగాను సకలజన సంయుక్త సగుణధ్యాన అస్మద్ధివ్యనామ పఠనాపరులై ఆనందానయుండేది.
ద్వితీయాశ్వాసం సంపూర్ణం.

