
-
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
కం|| సిరిమించు కందిమల్లయ్య
పురమునగల మఠములోని బుధనుతుడగుశ్రీ
గురువీరబ్రహ్మన్వయ
చరితము వినిపింతుగురుని – శరణనినిపుడున్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, మైదుకూరు మండల సమీపంలో అల్లాడుపల్లె అను గ్రామము కలదు. ఆ గ్రామ సమీపమున “కుముద్వతి” అను నది ప్రవహించు చున్నది. అది వేసవికాలములో ప్రవాహము తగ్గి సన్నగా పారుచుండును. దానిలో పెద్ద మడుగు ఒకటి యుండెను. వేసవి కాలములో కూడ ఆ మడుగులోపల నీరు ఉండును. ఎనుబోతులు (దున్నలు, బర్రెలు) దానిలో పొర్లుచుండుట వలన దానిని “పోతుల మడుగు” అని అనుచుండిరి.ఆ ప్రాంతపు పశువుల కాపరులు పశువులను మేపుకొని ఆ మడుగులో పశువులకు నీరు త్రాగించి సాయంత్రము వారివారి గ్రామాలకు చేరుకొనుచుండిరి. వేసవికాలములో పశువుల కాపరులు పోతులమడుగులో ఈత కొట్టడంతో ఆ మడుగు లోపల నీటిలో వాళ్లకు శిలా విగ్రహము ఒకటి తగిలెను.
పశువుల కాపరులు అందరు కలిసి నీటిలో నుండి తీసి బయటికి తెచ్చి గడ్డపై నుంచి సమీప గ్రామపెద్దలకు తెలియజేసిరి. మరునాడు అల్లాడుపల్లె గ్రామపెద్దలందరు పోతులమడుగు దగ్గరికి వచ్చి విగ్రహాన్ని చూచి, ఇది ఏకాలమునాటిదో మడుగులోనికి ఎలా వచ్చినది? దీనిని ఏమి చేయవలెనో? అని ఆలోచించుచు జ్యోతిష్యాగమ వాస్తు శాస్త్ర ప్రవీణుడైన దువ్వూరు గురువయ్యాచార్యులను ఆహ్వానించి ఆ శిలా విగ్రహాన్ని చూపించగా ఆయన దానిని పరీక్షించెను. ఎలాంటి భిన్నము గాకుండా సత్యముగా ఉండెను. అది తెలిసికొని పెద్దలతో ఇట్లు చెప్పెను. గ్రామ పెద్దలారా! ఈ విగ్రహము ఎలాంటి భిన్నము కాకుండ సవ్యముగా కళాంశముగా ఉన్నది. పూర్వపు చరిత్ర, ఆధారములను అనుసరించి చూడగ త్రేతా యుగములో తక్షుని కూతురు కుముద్వతి అను ఆమె శ్రీరాముని కుమారుడైన కుశకుమారుని వరించెను. ఆయనే తనకు భర్త కావలెనని వీరభద్రస్వామిని గూర్చి తపస్సుచేసి, ఆ స్వామి అనుగ్రహము చేతనే * కుశకుమారుని వివాహము చేసికొన్నట్లు చరిత్ర ఆధారముల ద్వార తెలియుచున్నది. ఆనాటి నుండి ఈ నదికి ఆమె పేరుతో “కుముద్వతి” అను పేరు వాడుకలో ఉన్నది.
మీ గ్రామక్షేమము కొరకై ఈ నదిలో మీకు లభించినది. ఇది మీ పూర్వ జన్మపుణ్య ఫలము ఈ విగ్రహాన్ని మీ గ్రామములో ప్రతిష్ఠించి పూజించు చుండిన మీకు, మీ గ్రామ ప్రజలకు పుణ్యము ప్రాప్తించునని చెప్పగా విని ఆ పెద్దలందరు సంతోసించి ఒక సుముహూర్తమున ఆ విగ్రహాన్ని అల్లాడుపల్లె గ్రామమునకు తెచ్చి గురువయ్యాచార్యులచే విగ్రహమును ప్రతిష్ఠింప జేయించి వారినే అర్చకులుగా నియమించిరి. ** ఆ శిలా విగ్రహమును పూర్వము కుముద్వతి పూజించినందున వీరభద్రస్వామి అని, పోతులమడుగులో లభించినందున పోతులూరయ్యస్వామి అని నామ ద్వయముచే పూజలందుకొను చుండెను. అందులకే వారి గృహనామము పోతులూరువారు అను వాడుక గలదు. గురువయ్యాచార్యులు ఈశ్వరమ్మ దంపతులిద్దరు ప్రతిదినము పూజించుచుండిరి. అంతవరకు వారికి సంతానము కానందున ఒకనాడు ఈశ్వరమ్మగారు తన భర్తతో నాథా ! సూతులు లేకున్న సుఖములేదందురు కదా! సంతానప్రాప్తికై ఏ దేవుని పూజించవలె, ఏ నోములు నోమవలె ఏ వ్రతము చేయవలెనో చెప్పుడని ప్రార్థించగా! ఓ సతీ ! అన్ని పూజలకన్న గురుపుష్యయోగ వ్రతపూజ త్వరగా ఫలితమిచ్చునని చెప్పగా విని పరమ పతివ్రతయైన ఈశ్వరాంబ గురువారము పుష్యమి నక్షత్రము నుండి సోమవారము అయిదు రోజులు పూజలు చేసెను. ** ఒకనాడ కైలాసపతి స్వప్నదర్శనమిచ్చి ఈశ్వరాంబ లోకకల్యాణార్థమై నేనే నీ పుత్రునిగా జన్మింతునని చెప్పి అదృశ్యుడాయెను.
* చూడుడు ప్రపంచ నిష్ప్రపంచ కందార్థ సంగ్రహ పేజీ 24
** చూడుడు వీరబ్రహ్మండ సర్వశాస్త్ర సమాధానము పేజీ 99
*** కొన్నాళ్లకు ఈశ్వరాంబ గర్భము ధరించి నవమాసములు అయిన తర్వాత క్రీ॥శ॥ 1608 సరియగు కీలకనామ సంవత్సర చైత్రమాస శుక్ల పక్ష ఏకాదశీ ఆశ్లేష నక్షత్ర ఆదివారమునాడు పండంటి మగబిడ్డను గనెను. గురువయ్యాచార్యులు జ్యోతిష్యపండితులను ఆహ్వానించి ఆ బాలుని జాతకమును గూర్చి విచారించగ పండితులు శాస్త్రపరిశోధన గావించి ఇట్లు చెప్పిరి. గురువయ్యాచార్యా! ఈ బాలుడు లోకకళ్యానార్థమై జన్మించిన పరమేశ్వర అవతారుడని చెప్పగా విని, ఆ బాలునికి వీరబ్రహ్మేంద్రుడని నామకరణము చేసెను
*** చూడుడు ప్రపంచ నిష్ప్రపంచానుభవ కందార్థ సంగ్రహ పేజీ ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునివలె వృద్ధిజెందుచు పంచవర్ష ప్రాయుడు ఆయెను. తల్లిదండ్రులు ఆ బాలునికి వీరభద్రస్వామి సన్నిధిలో అక్షరాభ్యాసము చేసిరి. బాల వీరబ్రహ్మము మొదటి దశలో చదువుట వ్రాయుట అభ్యసించెను. రెండవ దశలో పురాణములన్నీ ధారాళముగా అభ్యసించెను. అష్ఠవర్ష ప్రాయమున ఆ బాలునికి ఆస్వామి సన్నిధిలో ఉపనయనము జేసిరి. నాటి నుండి బాల వీరబ్రహ్మము బ్రహ్మచర్యము వహించి ప్రతిదినము బ్రహ్మముహూర్తమున లేచి స్నానసంధ్యాదులు ముగించుకొని, ఆస్వామి సన్నిధిలో వేదపారాయణము జేయుచు తన తండ్రిగారి వద్ద ఆగమ, వాస్తుశాస్త్ర మొదలైన చతుషష్ఠి విద్యలను అవలీలగా గ్రహించుచు పదునాలుగు సంవత్సరముల ప్రాయము గలవాడు ఆయెను.
తే॥గీ॥ హరుడు మానవ రూపున నవతరించి
చెలగియానంద గురువుల సేవజేయ
సకలధర్మంబులెల్లను సంగ్రహింప
బయలు దేరెను విహరింప మదిదలంచె ప్ర. నిష్ప్ర

